Telangana | హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఖజానాకు ఆదాయం పడిపోతుండటంతో సర్కారు ఆందోళనలో పడిపోయింది. గత ఏడు నెలల్లో కీలక రంగాల నుంచి అంచనాలకు తగ్గట్టుగా ఆదాయం రాకపోవడం, నిరుడితో పోల్చితే వృద్ధిరేటు సగానికి పడిపోవడంతో తలపట్టుకున్నది. రోజువారీ ఖర్చులకే నిధులు సర్దుబాటు చేయలేక ఆర్థిక శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతుంటే.. ఎన్నికలకు ముందు ఇచ్చిన అడ్డగోలు హామీలు గుదిబండగా మారాయి. ఇప్పటికే అమలవుతున్న ఒకటీ అరా పథకాలకే చెల్లింపులు చేయలేకపోతున్నామని, కొత్తవి అంటే తమవల్ల కాదని చేతులెత్తేశారట. అందుకే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి తాత్కాలికంగా బ్రేకులు వేసినట్టు చెప్తున్నారు. వాస్తవానికి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని దీపావళి మరుసటి రోజే ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. దీపావళి దాటి 8 రోజులు గడిచినా ఉలుకూపలుకూ లేదు. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణకు అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నది.
‘రెవెన్యూ మొబిలైజేషన్’పై ఈ నెలలో కేవలం 3 రోజుల వ్యవధిలోనే డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి అయిన భట్టి విక్రమార్క రెండుసార్లు సమావేశాలు నిర్వహించడమే ఇందుకు ఉదాహరణ. ఈ నెల 4న సచివాలయంలో సమావేశం నిర్వహించగా, మళ్లీ 6న మరోసారి సమావేశం అయ్యారు. దీనిని బట్టే ప్రభుత్వం డబ్బు కోసం ఎంతగాఆరాటపడుతున్నదో అర్థం అవుతున్నదని అంటున్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆర్థిక వృద్ధిలో రాష్ట్రం ఎప్పుడూ వెనుకకు తిరిగి చూడనేలేదు. కరోనా విపత్తు సమయంలో మాత్రమే తడబడింది. సగటున 8 శాతానికి పైగా వృద్ధిరేటు నమోదైంది. అందుకే ‘కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ ఆర్థిక రంగానిది ఒక అద్భుతమైన విజయగాథ. దేశంలోని ఇతర రాష్ర్టాలు తెలంగాణను స్ఫూర్తిగా తీసుకోవాలి’ అని ఆర్థిక నిపుణుల నుంచి ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ఇదే వేగాన్ని కొనసాగిస్తే రెండంకెల వృద్ధిని సులభంగా అందుకోవచ్చని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా మారింది. గత ఏడు నెలల్లో వాణిజ్య పన్నుల శాఖ మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ స్థాయిలో గణాంకాలను నమోదు చేసింది. మిగతా శాఖలన్నీ నేలచూపులు చూస్తున్నాయి. ఫలితంగా గత ఏడు నెలల్లో ఆదాయ వృద్ధిరేటు 4 శాతం మాత్రమే నమోదైనట్టు గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఇది గత సగటుతో పోల్చితే సగం మాత్రమే.
ఆదాయం పెంచండి
రాష్ర్టానికి ఆదాయాన్నిచ్చే శాఖల్లో ఆశించిన మేర రాబడి రాకపోవడంపై సీఎం, డిప్యూటీ సీఎం అసహనంగా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై ఇప్పటికే ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతున్నదని, స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కనీసం సగమైనా అమలు చేయకపోతే పరిస్థితి అదుపులో ఉండదని ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. అందుకే తరుచూ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదాయ సమీకరణకు ఏకంగా క్యాబినెట్ సబ్ కమిటీనే నియమించారు. ఈ నెలలోనే వరుసగా రెండుసార్లు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించి, ఎలాగైనా ఖజానా నింపాలని ఆదేశాలు జారీచేశారు. పెండింగ్ బకాయిల లెక్క తేల్చాలని వన్ టైం సెటిల్మెంట్లు, ఇతర పరిష్కార మార్గాల ద్వారా ఆదాయాన్ని రాబట్టాలని ఆదేశించారు. బకాయిదారులను కార్యాలయాలకు రప్పించడం కాదని, అవసరమైతే అధికారులే వారి వద్దకు వెళ్లి సెటిల్మెంట్కు ఒప్పించాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతోపాటు భూముల అమ్మకం, తనఖా పెట్టడం ద్వారా నిధులు సమీకరించాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. మైనింగ్ శాఖలో అనుమతులు పొంది, పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై దృష్టి పెట్టాలని, రెన్యువల్స్, పెండింగ్ బకాయిలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కూడా చెప్పారట.
చేసింది చేసి.. మమ్మల్ని అంటే ఎలా?
ఆదాయాన్ని పెంచాలి.. అంటూ తరుచూ మీటింగ్లు పెట్టి ఒత్తిడి తేవడంపై ఆయా శాఖల అధికారులు అసహనంతో ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకొని ఖజానాను ఖాళీచేసి తమపై ఒత్తిడి తెస్తే ఎలా అని తలలు పట్టుకుంటున్నారట. ఉదాహరణకు.. భూము లు, ఆస్తుల క్రయవిక్రయాలు తరుచూ జరుగుతుంటేనే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం వస్తుందని గుర్తుచేస్తున్నారు. కానీ ప్రభుత్వం హైడ్రా, మూసీ ప్రాజెక్టు, కూల్చివేతల ఫలితంగా క్రయవిక్రయాలు నిలిచిపోయాయని, దీనికి తామెలా బాధ్యు లం అవుతామని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నెలవారీ ఎక్సైజ్ టార్గెట్లు, రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నా ఆదాయం పెరగకపోతే తామేం చేస్తామని తేల్చి చెప్తున్నారని వినికిడి. బెల్ట్ షాపులను బాగా ప్రోత్సహిస్తున్నా ఫలితం ఉండటం లేదని వాపోతున్నారు. ఇదే తరహాలో వాహనాల కొనుగోళ్లు సైతం మందగించాయని అంటున్నారు.
బీఆర్ఎస్ హయాంలో పెరిగిన కొనుగోలు శక్తి
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు, పంట కొనుగోళ్లు, సబ్సిడీలు, బతుకమ్మ చీరలు.. ఇలా వివిధ పథకాల రూపం లో ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేసేదని, ఈ డబ్బు భూములపై పెట్టుబడులు, వస్తువుల కొనుగోళ్ల రూపంలో మళ్లీ మార్కెట్లోకి వచ్చేదని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ గొలుసు దెబ్బతిన్నదని అంటున్నారు. మొదటి విడత రైతుబంధు ఆలస్యం చేయడం, రెండో విడత ఎగ్గొట్టడం, బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వకపోవడం, పంటల కొనుగోళ్లలో గందరగోళం వంటి చర్యలతో సమాజంలో నగదు చెలామణి తగ్గిందన్నారు. ఇది రాష్ట్ర ఆదాయంపై ప్రభావం చూపిందని చెప్తున్నారు. రానురాను ఈ పరిస్థితి ఇంకా దిగజారుతుందనీ హెచ్చరిస్తున్నారు.