హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతున్నది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రారంభించారు. ప్రజలకు అభయహస్తం దరఖాస్తులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నామన్నారు. తమది ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వమని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు. ఎవరూ ఇబ్బంది పడాల్సిన పనిలేదని, ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. సంక్షేమ ఫలాలు అందరికి అందేలా చూస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు.
బంజారాహిల్స్ సీఎంటీసీలో ప్రజాపాలన కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ప్రజలకు ఏవైనా సందేహాలుంటే అధికారులతో సమాచారం తీసుకోవాలన్నారు. ప్రజల వద్దకే పాలన పేరుతో ఈ కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. ఎలాంటి పైరవీలకు అవకాశం లేదని స్పష్టం చేశారు.