హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని, దానిపై గద్దలు, పెద్దలు, రాబందులను వాలనివ్వనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, కార్మికుల పూర్తి కమిట్మెంట్తో సంస్థ భవిష్యత్తును కాపాడుతామని స్పష్టంచేశారు. సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 42 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, 30 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వస్తున్న కథనాలు తనను ఆవేదనకు గురిచేశాయని చెప్పారు. శనివారం జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో టెండర్ల ఫైళ్లు, తన వద్దకు, రాష్ట్ర ప్రభుత్వం వద్దకు రావని చెప్పారు. సింగరేణి సంస్థకు స్వయంప్రతిపత్తి బోర్డు ఉన్నదని, ఆ సంస్థ విధివిధానాలు, నిబంధనల ప్రకారం అధికారులు నిర్ణయాలు తీసుకుంటారని, ఇందులో రాజకీయ జోక్యానికి తావు ఉండదని తెలిపారు.
సింగరేణి సంస్థ నైని బొగ్గు బ్లాక్ కాంట్రాక్ట్ విషయంలో కాంట్రాక్టర్లు ముందుగా సైట్ విజిట్ చేయాలని, గని అధికారుల నుంచి సైట్ విజిట్ సర్టిఫికెట్ పొందితేనే కాంట్రాక్టులో బిడ్డింగ్‌కు అర్హత కల్పిస్తూ తానేదో కొత్త నిబంధన పెట్టినట్టు రాధాకృష్ణ కట్టు కథనాలు, పిట్ట కథలు అల్లి వార్త ప్రచురించారని విమర్శించారు. సైట్ విజిట్ చేయడం అనేది 2018, 2021, 2023లో కోలిండియా అనుబంధ సంస్థ సీఎంపీడీఐఎల్ రూపొందించిన సింగరేణి టెండర్ డాక్యుమెంట్, ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్ఎండీసీ, ఐఐటీ, ఐఐఎం, ఫైనాన్స్, డిఫెన్స్ విభాగం, గుజరాత్‌లోని ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర చాలా కంపెనీల్లో చాలా ఏండ్లుగా ఉన్నదని తెలిపారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న నిబంధన అని, తాము కొత్తగా రూపొందించింది కాదని పేర్కొన్నారు.
అన్ని టెండర్లపై విచారణకు సిద్ధం
సింగరేణిలో డీజిల్ సరఫరాను కాంట్రాక్టర్లకే అప్పగించడం ద్వారా మరో కుంభకోణానికి తెరలేపారన్న హరీశ్‌రావు ఆరోపణలపై భట్టి స్పందించారు. జీఎస్టీ విధాన మార్పులు, డీజిల్ దొంగతనాలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాంట్రాక్టుల్లోనూ ఈ పద్ధతే అమలులో ఉందని పేర్కొన్నారు. హరీశ్‌రావు తమకు లేఖ రాస్తే నైని బ్లాక్ టెండర్పైనే కాకుండా 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని రకాల టెండర్లు, కాంట్రాక్టులపైనా విచారణ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ముఖ్యమంత్రి విదేశాల నుంచి రాగానే తాను స్వయంగా ఆయనతో మాట్లాడి విచారణకు ఆదేశించేలా చూస్తానని పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుకోవాల్సిన అవసరం అత్యంత కీలకమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తు రంగంలో మార్పులు, గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన బొగ్గు గనులను త్వరగా సొంతం చేసుకొని ఆపరేషన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. సింగరేణిని కేవలం బొగ్గుకే పరిమితం చేయకుండా క్రిటికల్ మినరల్స్ రంగంలోనూ విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.