హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తేతెలంగాణ): కార్మికుల డిమాండ్ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అధికారులు, కార్మిక సంఘాల నేతలతో కలిసి ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేయనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మిక జేఏసీ సుదీర్ఘ చర్చల అనంతరం శుక్రవారం రాత్రి మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు, అడ్లూరి, వివేక్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. ఆర్టీసీ కుటుంబంలోని ఒక వ్యక్తి దూరం కావడం బాధాకరమని పేర్కొన్నారు.
గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు అంగీకరించినట్టు తెలిపారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించినట్టు చెప్పారు. లోతుగా అధ్యయనం తర్వాత ప్రభుత్వ వెసులుబాటును పరిగణనలోకి తీసుకొని 11 శాతం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు. కార్మిక సంఘాలు లెవనెత్తిన డిమాండ్లపై ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాల నేతలు చర్చించి పరిష్కరించుకోనున్నట్టు స్పష్టంచేశారు. ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ధన్యవాదాలు తెలిపారు. చర్చల అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ జేఏసీ ఉంచిన 32 డిమాండ్లలో మూడు ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించిందని, మిగతా డిమాండ్లను ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి పరిష్కరించుకోవాల్సిందిగా సర్కార్ సూచించిందని తెలిపారు.