హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని, పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో జరిగిన కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంతోపాటు జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశంలో భట్టివిక్రమార్క తెలంగాణకు రావాల్సిన నిధులతోపాటు పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ర్టాలకు అందించే ప్రత్యేక ఆర్థిక సాయాన్ని రూ.2.5 లక్షల కోట్లకు పెంచాలని కోరారు. స్వరాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణకు మొదటి సంవత్సరంలో మంజూరైన రూ.495.21 కోట్ల సీఎస్ఎస్ గ్రాంట్లను పొరపాటుగా ఏపీకి విడుదల చేశారు. ఈ మొత్తాన్ని కేంద్రం ద్వారా తిరిగి తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.