హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘పోడు’ పట్టాలు పొందిన రైతుల భూముల్లో పంపుసెట్లకు సౌర విద్యుత్తు అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్లడించారు. ‘ప్రజావాణి’ కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం ప్రజాభవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి మాట్లాడుతూ.. సౌర విద్యుత్తు పరికరాల ఏర్పాటు నిమిత్తం గిరిజన సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును కంప్యూటరైజ్ చేసి సంబంధిత అధికారులకు పంపిస్తున్నామని, ఆయా సమస్యల పరిషారం కోసం వారు తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు తెలియజేసేలా పర్యవేక్షిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య తదితరులు పాల్గొన్నారు.