కొండాపూర్, మే 19: రాష్ట్రంలో హరిత భవనాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తామని, ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారాన్ని అందజేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. కనీసం 50% నీటిని, 40% విద్యుత్తును ఆదా చేయగలిగేలా హరిత భవనాలను నిర్మించాలని, సామాన్యులు సైతం కొనుగోలు చేయగలిగేలా ఆ భవనాలు ఉండాలని అన్నారు. ఆదివారం ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి హైటెక్స్‌లో గ్రీన్ ప్రాపర్టీషో ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విక్రమార్క మాట్లాడుతూ.. పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామంగా ఉన్నదని, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే పట్టణ రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మౌలిక వసతులను, వ్యర్ధాల నిర్వహణను మెరుగుపర్చడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఐజీబీసీ సభ్యులు, పలువురు బిల్డర్లు పాల్గొన్నారు.