దామరచర్ల, నవంబర్ 3: త్వరలోనే నూత న ఎనర్జీ పాలసీ ప్రవేశపెట్టి విద్యుత్ రంగంలో దేశంలోనే రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో ఆదివారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి యూనిట్-2 సింక్రనైజేషన్‌ను ప్రారంభించారు. అంతకుముందు మండల కేంద్రం వద్ద పవర్‌ప్లాంట్‌కు కావాల్సిన బొగ్గును తరలించే రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్యుత్తు రంగ నిష్ణాతులు, మేధావులు, ప్రజల అభిప్రాయంతో అసెంబ్లీలో చర్చించి నూతన ఎనర్జీ పాలసీని ప్రకటిస్తామని వెల్లడించారు. మే 2025 నాటికి యాదాద్రి పవర్ స్టేషన్ ద్వారా 4వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పవర్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని విద్యుత్తు ఉత్పాదనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు. రాష్ర్టాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉంచుతామని స్పష్టంచేశారు.
టౌన్షిప్ నిర్మాణానికి టెండర్లు
వైటీపీఎస్ ప్లాంట్‌లో వసతుల కల్పన పై టీజీ జెన్కో దృష్టిసారించింది. అధికారులు, సిబ్బంది కోసం ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నది. రూ.929 కోట్లతో నిర్మించేందుకు జెన్కో ఇటీవలే టెండర్లు ఆహ్వానించిం ది. ఇందులో నాలుగు రకాల క్వార్టర్లు నిర్మిస్తారు. ఏ-టైప్-2, బీ-టైప్-6 క్వార్టర్లను నిర్మిస్తారు. ఇవేకాకుండా పాఠశాల, హాస్పిటల్, క్లబ్‌హౌజ్, కమర్షియల్ కాంప్లెక్స్, ఫంక్షన్‌హాల్, ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు.