కేఆర్ఎంబీలో డిఫ్యూటేషన్ అధికారి హవా
విభజన చట్టానికి విరుద్ధంగా ఇష్టారాజ్యం
రాష్ర్టాలకు చెప్పకుండానే సమావేశాలు
కేంద్ర గెజిట్ అమలుకు తహతహ
రాష్ర్టాల అభ్యంతరాలు బుట్టదాఖలు
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన సంస్థే సమస్యాత్మకంగా మారింది. కృష్ణా నది నీటి వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), ఉన్న సమస్యలు పరిష్కరించకపోగా రెండు రాష్ర్టాలకు కొత్త తలనొప్పిగా మారింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకొంటూ రాష్ర్టాలపై జులుం చలాయిస్తున్నది. రాష్ర్టాలను సంప్రదించకుండానే ఏకపక్షంగా సమావేశ తేదీలను ఖరారు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకొంటున్నది. బోర్డు సభ్యుడు కూడా కాని వ్యక్తి మరీ కట్టుదాటి వ్యవహరిస్తున్నారని ఇరు రాష్ర్టాల ఇంజినీర్లు మండిపడుతున్నారు. రాష్ర్టాల అభ్యంతరాలను కేంద్రానికి తెలుపకుండా, కేంద్రంలోని మోదీ సర్కారు ఏది చెప్తే అదే శిరోధార్యంగా అమలుచేస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఆయనదే ఇష్టారాజ్యం
తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ, ప్రాజెక్టులు, కాలువల నిర్వహణ, పర్యవేక్షణలో వివాదాలు పరిష్కరించేందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 85ను అనుసరించి కేంద్రం కేఆర్ఎంబీని ఏర్పాటు చేసింది. ఇరు రాష్ర్టాలను సంప్రదించి, వారు అంగీకరించిన అంశాలను అమలుచేయటం బోర్డు పని. ఏకపక్షంగా నిర్ణయాలను తీసుకొనే హక్కు బోర్డుకు లేదు. కేఆర్ఎంబీ ఆదినుంచీ అందుకు భిన్నంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని ఇరు రాష్ర్టాల ఇంజినీర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విభజన చట్టం ప్రకారం.. బోర్డులో ఐదుగురు సాధారణ సభ్యులు, ఇద్దరు టెక్నికల్ సభ్యులు ఉండాలి. చైర్మన్‌తోపాటు, ఒక మెంబర్ సెక్రటరీని, ఎక్స్పర్ట్ (పవర్) మెంబర్‌ను, మొత్తంగా ముగ్గురు సీఈలను మాత్రమే కేంద్ర జల్‌శక్తి శాఖ నియమించాలి. ఇరు రాష్ర్టాలకు చెందిన నీటిపారుదలశాఖల కార్యదర్శులు సాధారణ సభ్యులుగా, ఆ శాఖల ఈఎన్సీలు టెక్నికల్ మెంబర్లుగా ఉంటారు. కీలక నిర్ణయాలన్నీ బోర్డు సభ్యులే తీసుకొంటారు. కానీ కేఆర్ఎంబీలో ప్రస్తుతం అందుకు భిన్నంగా పనులు సాగుతున్నాయి. మెంబర్ సెక్రటరీని కాదని, గెజిట్ అమలు కోసం డిప్యూటేషన్‌పై వచ్చిన ఓ అధికారి చక్రం తిప్పుతున్నారు. బోర్డు సభ్యుడు కూడా కానీ ఆ అధికారే సమావేశాల తేదీలు, ఎజెండా అంశాలను ఖరారు చేస్తుండటం గమనార్హం. ఈ నెల 6న నిర్వహించిన బోర్డు సమావేశంలో తెలంగాణ సాగునీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ స్వయంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారంటే సదరు అధికారి తీరు ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అయినా ఆ అధికారి తీరు మార్చుకోలేదని ఇంజినీర్లు ధ్వజమెత్తుతున్నారు.
స్పష్టత రాకుండానే డీపీఆర్‌లపై పట్టు
కేంద్రం విడుదల చేసిన గెజిట్ ప్రకారం ఏడాదిలోగా అనుమతిలేని ప్రాజెక్టులకు ఇరు రాష్ర్టాలు అనుమతులు తెచ్చుకోవాలి. అందుకు సంబంధించిన డీపీఆర్‌లు సమర్పించాలి. అయితే కృష్ణాపై వరద జలాల ఆధారంగానే ఇరు రాష్ర్టాలు చాలా ప్రాజెక్టులు చేపట్టాయి. వరద ఆధారిత ప్రాజెక్టులకు అనుమతిచ్చేందుకు సీడబ్ల్యూసీ నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయని, వాటిపై స్పష్టత ఇవ్వాలని కేంద్రానికి తెలంగాణ అనేకసార్లు విజ్ఞప్తి చేసింది. ఇదే విషయాన్ని బోర్డుకు సైతం స్పష్టం చేసినా ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి జవాబు రాలేదు. ఇవేవీ పట్టించుకోకుండా డీపీఆర్‌లు వెంటనే సమర్పించాలంటూ సదరు అధికారి తెలంగాణకు లేఖల మీద లేఖలు రాస్తున్నారు. కేవలం గెజిట్ అమలు చేయాలనే అత్యుత్సాహం తప్ప రాష్ర్టాల అభ్యంతరాలను పట్టించుకోవడం లేదు.
ఆర్డీఎస్‌పైనా అంతే
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ద్వారా కేటాయించిన మేరకు తెలంగాణకు నీరు రావడంలేదని, వెంటనే కాలువ, హెడ్ రెగ్యులేటరీని ఆధునీకరించాలని తెలంగాణ సర్కారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నది. ఆర్డీఎస్‌పై గతంలోనే కర్ణాటకతోపాటు, నిపుణుల కమిటీ అధ్యయనం చేసి రిపోర్టు అందజేశారని, కొంత మేరకు పనులు కూడా చేపట్టారని బోర్డుకు వివరించింది. అయినా వాటిని అమలు చేయకుండా కొత్తగా స్టడీ చేయడానికే సదరు అధికారి మొగ్గుచూపడం గమనార్హం. అదీగాక ఆర్డీఎస్ కాలువను హెడ్‌వర్క్స్ వద్ద 850 క్యూసెక్కులతో డిజైన్ చేసి, తెలంగాణ సరిహద్దుకు వచ్చేసరికి 770 క్యూసెక్కులకు తగ్గించారని తెలిపింది. కాలువ మొత్తాన్ని ఒకే సామర్థ్యంతో విస్తరించాలని, అప్పుడే తెలంగాణకు 15.9 టీఎంసీలు, కర్ణాటకకు 1.2 టీఎంసీల వాటా నీరు అందుతుందని తెలంగాణ ఇంజినీర్లు వాదిస్తున్నారు. అయితే, కేఆర్ఎంబీ కేవలం హెడ్‌రెగ్యులేటర్ మార్పులకు సంబంధించిన అంశాలపై స్టడీ చేయించడానికే పరిమితమైంది. స్టడీ కోసం సదరు అధికారి రూపొందించిన మార్గదర్శకాల్లో తెలంగాణ సిఫారసులు ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం.
ఏకపక్షంగా సమావేశాలు
ఇటీవల నిర్వహించిన బోర్డు సమావేశంలో తీసుకొన్న నిర్ణయం మేరకు నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై అధ్యయనం కోసం రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) ఏర్పాటయింది. బోర్డులో సభ్యుడు కూడా కాని సదరు అధికారే ఆ కమిటీకి కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఇదిలా ఉంటే రాష్ర్టాలను సంప్రదించకుండానే ఈ నెల 20న ఆర్ఎంసీ సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు. వర్షాకాల సీజన్ రాబోతున్న నేపథ్యంలో సమావేశాన్ని జూన్ 15 తరువాత ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరినా పట్టించుకోలేదు. దీంతో సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరుకాలేదు. అయినప్పటికీ సమావేశాన్ని వాయిదా వేయకుండా ఏపీ అధికారులతో ఏకపక్షంగా నిర్వహించడం సదరు అధికారి తీరుకు అద్దం పడుతున్నది. రాష్ర్టాలను సంప్రదించకుండానే మరోసారి ఈ నెల 30, 31 తేదీల్లో సమావేశం నిర్వహించాల్సిందేనంటూ రాష్ర్టాలకు లేఖ రాయటం గమనార్హం.