హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమార్కులను అందలమెక్కించడమే పనిగా పెట్టుకున్నది. అందులో భాగంగా అవినీతి ఆరోపణలు, వివాదాలను ఎదుర్కొంటున్న ఓ అధికారిని డిప్యూటేషన్‌పై ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్‌గా నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఆ అధికారి నియామకానికి ప్రభుత్వ పెద్దలు సైతం అంగీకారం తెలిపినట్టు సమాచారం. దీంతో నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలుస్తున్నది. దీనిపై ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్లో జీఎం పోస్టుకు అర్హులైన సీనియర్ అధికారులు ఉన్నారని, వారికి పదోన్నతులు కల్పించకుండా డిప్యూటేషన్‌పై నియమించడమెందుకని ప్రశ్నిస్తున్నారు.
ఏడాది నుంచి ఎండీ పోస్టు..3 నెలలుగా జీఎం పోస్టు ఖాళీ
తెలంగాణ షెడ్యూల్డ్ కులాల కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రత్యేకమైంది. షెడ్యూల్డ్ కులాల వారికి సబ్సిడీ రుణాలను అందజేయడంతోపాటు నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు, వ్యవసాయాభివృద్ధి తదితర పథకాలు ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. కార్పొరేషన్ ఎండీగా విధులు నిర్వర్తించిన కరుణాకర్ నిరుడు విరమణ పొందడంతో నాటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉన్నది. ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ క్షితజ ప్రస్తుతం ఇంచార్జి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ (జీఎం)గా విధులు నిర్వర్తిస్తున్న ఆనంద్ గత మే నెలలో ఏసీబీకి పట్టుబడటంతో ఎస్సీ సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ (ఏడీ) శ్రీధర్‌కు జీఎంగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయి జీఎంను నియమించలేదు. వాస్తవానికి ఎస్సీ కార్పొరేషన్లో జీఎం పోస్టుకు అర్హులైన సీనియర్ అధికారులు కొందరు ఉన్నారు. 20 ఏండ్లుగా ఆ కార్పొరేషన్ ఈడీగా వ్యవహరిస్తున్న దళిత అధికారి ప్రమోషన్ జాబితాలో ముందున్నారు. అదేవిధంగా మరో మహిళా అధికారితోపాటు మరొకరు సైతం సీనియార్టీ జాబితాలో ఉన్నారు. కానీ, వారికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించకపోవడంపై కార్పొరేషన్ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వివాదాస్పద అధికారికి జీఎంగా డిప్యూటేషన్
ఎస్సీ కార్పొరేషన్‌లోని సీనియర్ అధికారులకు పదోన్నతులు కల్పించని ప్రభుత్వం.. తాజాగా జీఎం పోస్టును డిప్యూటేషన్‌పై భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకు డిప్యూటేషన్‌పై సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సొసైటీలో పనిచేసిన ఓ అధికారినే తిరిగి ఎస్సీ కార్పొరేషన్ జీఎంగా నియమించాలని ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అత్యంత వివాదాస్పదుడైన ఆ అధికారిపై గురుకుల సొసైటీలో ఏమాత్రం సదాభిప్రాయం లేదు. ఆ సొసైటీలో సిబ్బంది బదిలీలు, పదోన్నతుల్లో అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ అధికారి తీరును సొసైటీ టీచర్లు బాహాటంగానే విమర్శించడంతోపాటు ఏకంగా ప్రజాభవన్ వద్దకే వెళ్లి ధర్నాలు కూడా నిర్వహించారు. సొసైటీ ఉద్యోగులతోపాటు మాదిగ, మాల, లంబాడ వర్గాలకు చెందిన పలు సంఘాల నేతలు సైతం ఆ అధికారిపై మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి పదోన్నతులు పొందారని, సొసైటీలో నియంతగా మారారని ఆరోపిస్తూ.. ఆయనపై ఏసీబీ కేసు పెట్టాలని గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపడంతో సదరు అధికారి వ్యవహారంపై అంతర్గతంగా విచారణ నిర్వహించిన ఉన్నతాధికారులు.. గత అక్టోబర్‌లో ఆయనను సొసైటీ నుంచి తప్పించారు. అనంతరం ఆ అధికారిని సొంత డిపార్ట్మెంట్కు పంపకుండా సెక్రటేరియట్లో రిపోర్టు చేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. దాదాపు ఏడాది నుంచి ఆయనకు ఎలాంటి పోస్టింగ్‌ను ఇవ్వలేదు.
ఎస్సీ డిపార్ట్మెంట్ ఏడీగా శ్రీధర్
ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్‌గా శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి జ్యోతిబుద్ధ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఏడీగా విధులు నిర్వర్తిస్తున్న ఉమాదేవి ఈ నెల 31న ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఆమె స్థానంలో శ్రీధర్‌ను ఏడీగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన ఎస్సీ కమిషనర్ కార్యాలయం ఓఎస్డీగా,
కార్పొరేషన్ జీఎంగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
డిప్యూటేషన్ వద్దు.. ప్రమోషన్ కల్పించండి ; ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): తెలంగాం ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ పోస్టును డిప్యూటేషన్ ద్వారా కాకుండా సీనియర్లకు ప్రమోషన్ కల్పించి భర్తీ చేయాలని ఆ కార్పొరేషన్ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సీనియర్లకు అన్యాయం చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆదివారం ఆ సంఘం నాయకులు హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమభవన్‌లో రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సంఘం గౌరవ అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగుల సమస్యలతోపాటు పలు అంశాలపై సుదీర్ఘ చర్చించారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ.. ఎస్సీ కార్పొరేషన్ జీఎం పోస్టును సర్వీస్ నిబంధనల ప్రకారమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్లో అర్హులైన, సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ అధికారులు ఉన్నారని పేర్కొంటూ.. వారికే జీఎంగా పదోన్నతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలా కాకుండా ఇతర శాఖల అధికారులను డిప్యూటేషన్‌పై నియమిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన 50% పోస్టులను బదిలీ చేయాలంటూ ఎస్సీ డెవలప్మెంట్ శాఖ చేసిన ప్రతిపాదనను తిరస్కరించాలని కోరారు. డీపీసీ కమిటీలో ఎస్సీ కార్పొరేషన్ ఎండీని కూడా నియమించాలని, కార్పొరేషన్లో కారుణ్య నియామకాలు చేపట్టాలని, ప్రధాన కార్యాలయంలో యూనియన్‌కు ప్రత్యేక గదిని కేటాయించాలని సమావేశంలో తీర్మానించారు. అనంతరం సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బాబు మోజెస్, జనరల్ సెక్రటరీగా మాధవీలత, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్, న్యాయ సలహాదారుగా పిల్ల రాజయ్య, కోశాధికారిగా బ్రహ్మచారి, జాయింట్ సెక్రటరీగా ఎస్బీ రామాచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాగి ఉపేందర్‌రావు ఎన్నికయ్యారు. సమావేశంలో 33 జిల్లాలకు చెందిన కార్పొరేషన్ ఈడీలు, ఉద్యోగులు పాల్గొన్నారు.