Junk Food | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఆహారంపైనే మన శారీరక, మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని, జంక్ ఫుడ్ (అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్)తో డిప్రెషన్, అధిక ఒత్తిడి లాంటి మానసిక రుగ్మతలు పెరుగుతాయని ప్రముఖ అంతర్జాతీయ న్యూట్రిషన్ సంస్థ సపైన్ ల్యాబ్ వెల్లడించింది. జంక్ ఫుడ్ ప్రభావంపై ఈ సంస్థ భారత్, అమెరికా, బ్రిటన్, ఫిలిప్పైన్స్, ఈజిప్టు, మొరాకో, వెనిజులా తదితర దేశాల్లోని 2.86 లక్షల మంది ఆహార అలవాట్లు, శారీరక, మానసిక ఆరోగ్యంపై దాదాపు 8 నెలలపాటు సుదీర్ఘ అధ్యయనం జరిపింది.
అందులో భాగంగా వారికి మూడు రోజులపాటు వివిధ రకాల ఆహారాలను అందిస్తూ మానసిక స్థితిపై పడిన ప్రభావాన్ని పరిశీలించింది. తాజా కూరగాయలు, పండ్లు అధికంగా తీసుకున్నవారి కంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నవారిలో అధిక ఒత్తిడి, డిప్రెషన్ పెరగడంతోపాటు మానసిక ఆరోగ్యం తగ్గినట్టు ఈ పరిశోధనలో తేలింది. అయితే, జంక్ ఫుడ్ తీసుకున్నప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలో ఈ ప్రభావం కొంత తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు.