హైదరాబాద్, సిటీబ్యూరో జూన్ 7 (నమస్తే తెలంగాణ): నిమ్స్ డైరెక్టర్‌గా సర్జికల్ గ్యాస్ట్రోలజీ విభాగం హెచ్‌వోడీ, ప్రొఫెసర్ బీరప్పను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనను పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమిస్తూ హెల్త్ సెక్రటరీ రిజ్వి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బళ్లారి జిల్లాకు చెందిన నిరుపేద రైతు లింగారెడ్డి, హనుమంతమ్మ దంపతులకు 1962లో డాక్టర్ బీరప్ప జన్మించారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నత విద్య అభ్యసించారు. 1985లో గుల్బ ర్గాలో ఎంబీబీఎస్ చదివారు. 1990 లో మైసూర్ వర్సిటీ నుంచి ఎంఎస్ జనరల్ సర్జన్ పూర్తిచేసి, అదే సంవత్సరం రెసిడెంట్ వైద్యుడిగా నిమ్స్‌లో చేరారు.
2019లో అమెరికా నుంచి ఎఫ్ఎసీఎస్, 2020లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కొలొప్రొక్టోలజీ ఫెలోషిప్ చేశారు. 2021లో ఇంగ్లండ్ నుంచి ఎఫ్ఆర్సీఎస్ పూర్తిచేశారు. 2010లో జీఐ సర్జరీ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది, 2012లో సర్జికల్ గ్యాస్ట్రో విభాగాధిపతిగా నియమితులయ్యారు. ఆరు నెలలుగా తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న బీరప్పను పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు డాక్టర్ బీరప్ప ధన్యవాదాలు తెలిపారు.