హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను సన్నద్ధం చేయడమేగాక పాసవడంలో తల్లిదండ్రులు తోడ్పాటునందించాలని విద్యాశాఖ కోరింది. ఈ మేరకు వినూత్నంగా విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు రాసింది. ఏప్రిల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 5 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరుకాబోతున్నారు.
ఆరు పేపర్లకు కుదించడం, పరీక్షలు దగ్గరపడుతున్నవేళ విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా చర్యలు చేపట్టడంలో భాగంగా విద్యాశాఖ తల్లిదండ్రుల సహకారాన్ని కోరింది. పిల్లలు ఎలా చదువుతున్నారు? వారి గురించి చర్చించేందుకు ఈ నెల 25, మార్చి 18, మార్చి 31 తేదీల్లో నిర్వహించే సమావేశాలకు హాజరుకావాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది. కాగా, వందశాతం ఉత్తీర్ణతను సాధించేందుకు విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకొన్న విషయం తెలిసిందే.