హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు పశుసంవర్ధక శాఖ చర్యలు చేపట్టింది. మొదటి దశ పంపిణీలో వచ్చిన ఆరోపణలకు చెక్ పెట్టేలా రెండోదశ పంపిణీలో పారదర్శకతకు పెద్దపీట వేసిన అధికారులు.. ఇందుకోసం విప్లవాత్మకమైన సంస్కరణలను అమలు చేయబోతున్నారు. లబ్ధిదారుల వాటా చెల్లించటం మొదలుకొని వేరే రాష్ర్టానికి వెళ్లి గొర్రెలు కొని… తన స్వస్థలం వెళ్లేంత వరకు అడగడుగునా నిఘా పెట్టనున్నది. గతంలో ఏఏ అంశాల్లో అయితే ఆరోపణలు వచ్చాయో.. వాటిపై ప్రధానంగా దృష్టిపెట్టింది. ఇందుకోసం ఈ-లాబ్ పేరుతో ప్రత్యేక పోర్టల్ తయారీతో పాటు మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి అంశాన్ని ఈ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
గొర్రెల పంపిణీలో ఏవేవో గొర్రెలను లబ్ధిదారులకు అందించడం కాకుండా వారికి నచ్చిన గొర్రెలను ఎంచుకునే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు. గొర్రెలు కొనుగోలుకు ఇతర రాష్ర్టాలకు వెళ్లే సమయంలో అధికారులతో పాటు లబ్ధిదారులను కూడా తీసుకెళ్లనున్నారు. లబ్ధిదారులు అక్కడ గొర్రెలను పరిశీలించి నచ్చిన వాటిని ఎంచుకోనున్నారు.
లబ్ధిదారులకు నిజంగా గొర్రెలను పంపిణీ చేశారా?.. లేదా? అనే అంశాన్ని పరిశీలించేందుకు లబ్ధిదారుడు గొర్రెలతో ఉన్న ఫొటోను, వీడియోను ఈ-లాబ్ పోర్టల్‌లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకున్నారు. గొర్రెల కొనుగోలు సమయంలో వాహనంలోకి గొర్రెలను ఎక్కించేటప్పుడు లబ్ధిదారుడితో ఫొటో తీస్తారు. అదే విధంగా తన స్వస్థలానికి వచ్చిన తర్వాత మరో ఫొటో తీయటంతోపాటు గొర్రెల మంద వద్ద లబ్ధిదారుడిని నిలుచోబెట్టి ‘నాకు ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలు అందాయి’ అంటూ రైతులు తమ పేరు, ఊరిపేరుతో చెప్తుండగా వీడియో రికార్డు చేస్తారు. ఈ వీడియోను పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు.
పంపిణీ చేసే గొర్రెలను అధికారులు ముందుగా నిర్ణయించిన రాష్ట్రంలోని ఫలానా ప్రాంతం నుంచే తీసుకొచ్చారా? లేక ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చారా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి ట్రాన్స్పోర్ట్ వాహనానికి జీపీఎస్ సిస్టంను అమర్చారు. ఈ వాహనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించింది? ఎక్కడి వరకు వెళ్లింది? వంటి అంశాలను జీపీఎస్ ద్వారా తెలుసుకోనున్నారు. తద్వారా స్థానికంగా గొర్రెలను తీసుకొచ్చి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారనే విమర్శలకు చెక్ పెట్టనున్నారు. పోర్టల్‌లో లారీ వివరాలను, డ్రైవర్ వివరాలను కూడా నమోదు చేయనున్నారు.
మొదటి దశ పంపిణీలో ఇతర రాష్ర్టాల నుంచి గొర్రెలను తీసుకొచ్చేందుకు వెటర్నరీ డాక్టర్లు వెళ్లారు. అయితే వారంతా పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రెండోదశ పంపిణీలో ప్రభుత్వం వారిని పక్కన పెట్టింది. వీరి స్థానంలో జిల్లా పశుసంవర్ధక శాఖ ఏడీలను పంపించాలని నిర్ణయించింది. అయితే వెటర్నరీ డాక్టర్లు వెళ్లకపోవడం వల్ల అక్కడ గొర్రెల ఆరోగ్యస్థితిని అంచనా వేయటం సాధ్యంకాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏడీలతో పాటు వెటర్నరీ డాక్టర్లను కూడా పంపించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గొర్రెల పంపిణీలో మూడంచెల పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. మండలస్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. గొర్రెల పంపిణీ మొత్తం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. జిల్లా, మండలస్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ జిల్లాల వారీగా పంపిణీ కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఏఏ జిల్లాల అధికారులు గొర్రెల కొనుగోలుకు ఏఏ రాష్ర్టాలకు వెళ్లాలనేది నిర్దేశిస్తారు. ప్రతిస్థాయిలో పారదర్శకత ఉండేలా పోర్టల్ సాయంతో చర్యలు తీసుకుంటారు.
ఒక్కో లబ్ధిదారినికి ఒక యూనిట్(21 గొర్రెలు) పంపిణీ చేయాలి. ఈ నేపథ్యంలో ప్రతి లబ్ధిదారునికి పక్కాగా నిర్ణీత సంఖ్యలో గొర్రెలను పంపిణీ చేసేలా, పంపిణీ చేసే ప్రతి గొర్రెకు ట్యాగ్‌ను ఏర్పాటు చేసి దానికి ప్రత్యేక నంబర్‌ను కేటాయించనున్నారు. ఈ-లాబ్ పోర్టల్‌లో లబ్ధిదారునికి పంపిణీ చేసిన గొర్రెలన్నింటి ట్యాగ్ నంబర్లను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ట్యాగ్‌లను న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తున్నది. డూప్లికేట్ ట్యాగ్లు వేయకుండా ముందుగానే కోడింగ్ చేసిన ట్యాగ్‌లను పంపిణీ చేయనున్నారు. 21 గొర్రెల ట్యాగ్‌లను పోర్టల్‌లో అప్లోడ్ చేస్తేనే అది ముందుకు వెళుతుంది.
సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు గొర్రెల పంపిణీని పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. ఏ ఒక్క లబ్ధిదారునికి కూడా అన్యాయం జరగకుండా ఈ-లాబ్ సాయంతో ఐదారు సంస్కరణలు చేపట్టాం. లబ్ధిదారులకు ఆరోగ్యకరమైన గొర్రెలను అందించేలా చర్యలు తీసుకున్నాం. లబ్ధిదారుల ప్రమేయం లేకుండా ఒక్క గొర్రె కూడా రాష్ర్టానికి రాకుండా ప్రతిస్థాయిలో నిఘా పెట్టాం.
– రాంచందర్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ