హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ‘డీఈవోలంటే చులకనభావం వద్దు. అనుభవజ్ఞులు, సీనియర్లు ఉన్నారు. అంతా కష్టపడి పనిచేస్తున్నారు. దయచేసి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. ఉదయం ఏడు గంటలకే పరుగెత్తాలి. సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జూమ్ మీటింగ్‌లు పెట్టి సతాయిస్తే ఎలా? ఇంటికెళ్లినా జూమ్ మీటింగ్‌ల్లోనే ఉండటంతో కుటుంబసభ్యులు విసుక్కుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో పది మంది పది రకాలుగా ఆదేశాలిస్తారు. మేం జిల్లాలో ఉండేది ఒక్కరమే. మాకు జిల్లాలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లుంటారు. ప్రజాప్రతినిధులు, మీడియా, విద్యార్థి సంఘాలందరికీ మేమే సమాధానం చెప్పాలి.
రకరకాల టార్చర్స్ అనుభవిస్తున్నాం. అర్థం చేసుకోండి. 12 రెగ్యులర్ డీఈవో పోస్టులుంటే నలుగురే పనిచేస్తున్నారు. మిగతా అన్నీ ఖాళీలే. వాటిని నింపడం లేదు. కొత్త పోస్టులు మంజూరుచేయడంలేదు. 33 జిల్లాలకు 12 మినహా పోస్టులే లేవు. వీటి గురించి ఎవ్వరూ మాట్లాడరు. అన్క్వాలిఫైడ్ వాళ్లను పెట్టి నడిపిస్తున్నారు. ఇంకా ఒత్తిడి తెస్తే పారిపోవాల్సి వస్తుంది’- ఇది ఓ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) వ్యక్తంచేసిన ఆవేదన. అసంతృప్తి. ఏకంగా విద్యాశాఖ ఉన్నతాధికారుండే వాట్సాప్ గ్రూపులోనే ఆ డీఈవో తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులు తమ బాధలను అర్థంచేసుకోవాలని విన్నవించారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్లకు విద్యాశాఖ శిక్షణనిస్తున్నది. ఐదు రోజుల ఈ శిక్షణ శనివారంతో ముగియనున్నది. శిక్షణ సందర్భంగా విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీ అధికారులు ప్రతిరోజూ సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జూమ్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. ఎంఈవోలు, డీఈవోలు, ఇతర అధికారులు దాదాపు 800 మందితో ప్రతిరోజూ సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఈ సమీక్షల్లో ఒక అధికారి ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, ఆదిలాబాద్ డీఈవోపై నోరుపారేసుకున్నారని, మరో జిల్లా డీఈవోను తీవ్రంగా మందలించారనే ప్రచారం జరుగుతున్నది. ‘ఆర్జేడీగారూ.. ఈ డీఈవోకు మెమో ఇవ్వండి.. సస్పెండ్ చేయండి’ అంటూ ఆదేశాలిచ్చారని చర్చించుకుంటున్నారు. ఇలా అందరి ముందే తమను అవమానించడం పట్ల సదరు డీఈవోలు రగిలిపోతున్నారు. సదరు అధికారి పెత్తనం చెలాయించడం, హెచ్చరికలకు దిగుతుండటంతో డీఈవోలు వర్సెస్ ఉన్నతాధికారులు అన్నట్టుగా పరిస్థితి తయారైంది.
టీచర్ల శిక్షణ, విద్యాకార్యక్రమాల పర్యవేక్షణకు విద్యాశాఖ కొందరు ఉన్నతాధికారులను పరిశీలకులుగా నియమించింది. విద్యాశాఖలోని అడిషనల్ డైరెక్టర్ (ఏడీ), జూయింట్ డైరెక్టర్ (జేడీ)లను పలు జిల్లాలకు పరిశీలకులుగా నియమించారు. అయితే, ఇష్టారీతిన బాధ్యతలు అప్పగించారంటూ కొందరు ఉన్నతాధికారులు అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. సీనియర్ అధికారులను సుదూర ప్రాంతాల్లోని జిల్లాలకు, జూనియర్లు, తమకు కావాల్సిన వారిని హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు పరిశీలకులుగా నియమించారని, దీంతో సీనియర్లు గుర్రుగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది.
మొత్తంగా సమీక్షలు, జూమ్ మీటింగ్‌లు ఎక్కువ.. పని తక్కువ అన్నట్టుగా పరిస్థితి తయారైందని అధికారులు చర్చించుకుంటున్నారు. వరుస సమీక్షలతో ఫోన్లు వేడెక్కి, రేడియేషన్ సమస్యలతో చికాకుపుడుతున్నదని మరో అధికారి వాపోయారు. ఇక కొందర్ని ఇంటర్‌బోర్డు కార్యదర్శి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్లకు రిపోర్టు చేయాలని ఆదేశించినట్టు తెలుస్తున్నది. దీంతో పాఠశాల విద్యాశాఖకు సంబంధంలేని వారికి తాము రిపోర్టుచేసేదెలా అంటూ కొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు.
విద్యాశాఖలోని కొందరు ఉన్నతాధికారుల తీరు, వ్యవహారశైలిని నిరసిస్తూ కొందరు డీఈవోలు సహాయ నిరాకరణ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. జూన్‌లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకానున్నది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు, నోటుపుస్తకాలను విద్యాశాఖ అందించాల్సి ఉన్నది. ఈ నెల 31 కల్లా వీటన్నింటినీ సిద్ధం చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. జూన్ 12న పాఠశాలలు ప్రారంభించే రోజే వీటిని విద్యార్థులకు అందజేయాలి. డీఈవోలు సహాయ నిరాకరణ చేస్తే ఇవన్నీ విద్యార్థులకు సకాలంలో అందేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సర్కారు పెద్దలు చొర వ తీసుకుని, సమీక్షలు, వేధింపుల నుంచి తమకు విము క్తి కల్పించాలని డీఈవోలు, ఎంఈవోలు కోరుతున్నారు.