మహాదేవపూర్ జూన్ 9 : మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలను పెంచాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాధికారి రాజేందర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆయా ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి బడిబాట కార్యక్రమం పై దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతులు, సౌకర్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు క్షుణ్ణంగా వివరించి బడేటి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా ప్రోత్సహించాలని ఆయన ఉపాధ్యాయులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ అందజేస్తున్నారని తెలిపారు. బడిబాట కార్యక్రమంలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన మహాదేవపూర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అభిరామ్, బాలుర పాఠశాలలో వైష్ణవి, సూరారంలో అభినేశ్వర్, అంబటిపల్లి,కాలేశ్వరం, ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. మున్ముందు చదువుల్లో మరింత రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం బండం రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.