T20 World Cup Centurions : రేపటి నుంచే పదో సీజన్ టీ20 వరల్డ్‌కప్ పండుగ షురూ కానుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో ఇరవై జట్లు.. కప్ వేటకు సిద్ధమవుతున్నాయి. పొట్టి ఫార్మాట్ అంటేనే చెలరేగిపోయే పవర్ హిట్టర్లు ప్రపంచకప్‌లో ఊరికే ఉంటారా. తమదైన విధ్వంసంతో అభిమానులను అలరిస్తూ శతకాలతో చెలరేగిపోతుంటారు. ఈ ఐసీసీ ఈవెంట్లో ఇప్పటివరకూ 11 సెంచరీలు నమోదవ్వగా.. భారత్ నుంచి సురేశ్ రైనా (Suresh Raina) వంద కొట్టేశాడు. ఆరంభ సీజన్‌తో మొదలు ఎవరెవరు ఎన్ని సార్లు మూడంకెల స్కోర్‌తో విరుచుకుపడ్డారో తెలుసుకుందాం.
ప్రపంచకప్ అంటే చాలు కొంతమంది క్రికెటర్లు పూనకం వచ్చినట్టు రెచ్చిపోతారు. మేము ఆడితే రికార్డులు బద్ధలవ్వాల్సిందే అన్నట్టుగా బౌలర్ల భరతం పడుతూ సెంచరీలతో అలరిస్తారు. ఐసీసీ 2007లో తొలిసారి నిర్వహించిన పొట్టి ప్రపంచకప్‌లో క్రిస్ గేల్(Chris Gayle) శతకంతో మెరిశాడు. ఆతిథ్య దక్షిణాఫ్రికాపై ఉప్పెనలా విరుచుకుపడిన గేల్ .. 57 బంతుల్లోనే 10 సిక్సర్లు, 7 ఫోర్లతో 117 రన్స్ సాధించాడు.
We have witnessed 11 T20 World Cup centuries so far, and Chris Gayle is the only one to have smashed two centuries in the tournament! 🔥💯🌟#ChrisGayle #T20WorldCup #Cricket #Sportskeeda pic.twitter.com/5dVSCJQnaN
— Sportskeeda (@Sportskeeda) February 4, 2026
పొట్టి ప్రపంచకప్‌లో రెండో సెంచరీ మాత్రం సురేశ్ రైనాదే. 2010లో ఈ లెఫ్ట్ హ్యాండర్ సైతం సఫారీలపైనే వందతో గర్జించాడు. గ్రాస్ ఇస్లెట్ మైదానంలో చెలరేగిన రైనా.. 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 రన్స్ చేశాడు. ఈ మెగా టోర్నీలో మూడో సెంచరీ శ్రీలంక వెటరన్ మహేల జయవర్దనే నమోదు చేశాడు. ఇదే ఎడిషన్‌లో జింబాబ్వేపై అతడు వంద కొట్టాడు. 2012 ఎడిషన్‌లో న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెక్కల్లమ్ తన మార్క్ విధ్వంసంతో.. బంగ్లాదేశ్‌పై శతకంతో గర్జించాడు.
On this day in 2010, Suresh Raina smashes india’s only century in icc men’s T20 world cup history@ImRaina • #SureshRaina pic.twitter.com/oh5qFZBXmd
— Raina_memes 48 (@Raina_Memes_) May 2, 2022
ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ శ్రీలంకపై, పాకిస్థాన్ ఆటగాడు అహ్మద్ షెహజాద్ బంగ్లాదేశ్‌పై, తమీమ్ ఇక్బాల్ ఒమన్‌పై సెంచరీలు సాధించారు. 2016 వరల్డ్‌కప్‌లో సునామీ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ బౌలర్లను బెంబేలెత్తించిన క్రిస్ గేల్ అజేయ శతకం సాధించాడు. అనంతరం జోస్ బట్లర్ శ్రీలంకపై, రీలే రస్సో బంగ్లాదేశ్‌పై, గ్లెన్ ఫిలిప్స్ శ్రీలంకపై సెంచరీతో చెలరేగారు.
క్రిస్ గేల్(2007), సురేశ్ రైనా(2010), మహేల జయవర్ధనే(2010), బ్రెండన్ మెక్కల్లమ్(2012), అలెక్స్ హేల్స్(2014), అహ్మద్ షెహజాద్(2014), తమీమ్ ఇక్బాల్(2016), క్రిస్ గేల్ (2016), జోస్ బట్లర్ (2021), రీలే రస్సో(2022), గ్లెన్ ఫిలిప్స్(2022). అయితే.. గత ఎడిషన్‌లో మాత్రం ఒక్క సెంచరీ నమోదవ్వలేదు. కానీ, ఈసారి భీకర ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్ అభిషేక్ శర్మ వంద కొట్టినా కొట్టేస్తాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా స్క్వాడ్‌లోని శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు ఈ ఫార్మాట్లో సెంచరీలు సాధించిన వారే.