Floraide | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ గుండెలపై మళ్లీ ఫ్లోరైడ్ బండ పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తరిమేసిన ఫ్లోరైడ్ పీడ కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అని మళ్లీ వంకర్లు తిరిగి దర్శనమిస్తున్నది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో డెంటల్ ఫ్లోరోసిస్ కేసులతోపాటు ఎముకల (స్కెలటల్) ఫ్లోరోసిస్ కేసులు మళ్లీ నమోదవుతున్నట్టు ఇటీవలి సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టిన ఇంటెన్సివ్ సర్వేలో స్కెలటల్ ఫ్లోరోసిస్ కేసులు వెలుగుచూశాయి. ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధిలేమికి పరాకాష్టగా కొత్త కేసులు సవాలు విసురుతున్నాయి. మూడేండ్ల క్రితం ఫ్లోరైడ్ పీడ నుంచి విముక్తి పొందిన నల్లగొండ తాజా పరిణామాలతో ఉలిక్కిపడుతున్నది. వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల 34,800 మందితో ఇంటింటి సర్వే నిర్వహించింది. ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సర్వేలో వృద్ధుల్లో స్కెలటల్ ఫ్లోరోసిస్ కేసుల సంఖ్య అంతగా లేకపోయినా, యువత, పిల్లల్లో విస్తృత వ్యాప్తి చెందుతున్నట్టు వెల్లడి కావడం ఆందోళన కలిగిస్తున్నది.
ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాల్లో స్కెలటల్, డెంటల్ ఫ్లోరోసిస్ కేసులు పెరుగుతున్నాయనే అనుమానంతో నల్లగొండ జిల్లా యంత్రాంగం తాగునీటి సరఫరా తదితర అంశాల ప్రాతిపదికన అధ్యయనం చేసింది. మిషన్ భగీరథ మంచినీటి సరఫరాలో ఇటీవల అవాంతరాలు కలుగుతున్నాయని, ఫలితంగా కలిగే అనర్థాలను ముందస్తుగా అంచనా వేయాలని వైద్యాధికారులు నిర్ణయించారు. అధ్యయనం రిపోర్టును అధికారికంగా బయటికి వెల్లడించకపోయినప్పటికీ సమస్య తీవ్రతను గుర్తించిన అధికారులు ఫ్లోరోసిస్ ప్రభావ తీవ్రతను పసిగట్టారని, అందులో భాగంగానే ఇంటింటి ప్రజారోగ్య సర్వే నిర్వహించారని తెలుస్తున్నది. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీటిలో కలుషితాలు ఉన్నట్టు గుర్తించారు. దీని ప్రభావంతో తక్షణం ఆందోళనకరమైన పరిస్థితులు లేకపోయినా, ఫ్లోరోసిస్ విజృంభణ పెరిగి దీర్ఘకాలంలో తీవ్ర సమస్యగా పరిణమించే అవకాశాలు లేకపోలేదని సర్వేలో బయటపడుతున్న విషయాలను విశ్లేషిస్తున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు గట్టి చర్యలు తీసుకుంటే నివారణ గతంలో ఉన్నంత పెద్ద సమస్యగా ఉండకపోవచ్చని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
పార్లమెంట్ వేదికగా 2020 నుంచి 2022 వరకు అనేక పర్యాయాలు తెలంగాణను ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా నల్లగొండ జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన మంచినీటి సరఫరాతో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్రం ప్రకటించింది.
2014లో 413 మందికి 1.5 పీపీఎం కంటే ఎకువ ఫ్లోరిన్ శాతం ఉండేది. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య అంతకంతకూ తగ్గుతూ 2020 నాటికి అది పూర్తిగా లేకుండాపోయిందని నివేదికలు స్పష్టంచేశాయి. సురక్షితమైన మంచినీళ్లు తాగడంవల్లే ఫ్లోరైడ్ రావడంలేదని నిర్ధారించారు. గతంలో పిల్లల పళ్లపైనా గారలు కనిపించేవి. కానీ ఈ మధ్య కాలంలో అలాంటి లక్షణాలు కనిపించడంలేదని ఆ నివేదికలు తేటతెల్లం చేశాయి.
తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్‌లో 2015 జూన్ 8న మిషన్ భగీరథ పైలాన్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రమంతటా మిషన్ భగీరథ తలపెట్టిన కేసీఆర్ దానికి ఆరంభంగా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాన్నే ఎంచుకున్నారు. 2017లో అందరికీ నల్లా నీళ్లు అందించాలనే విషయమై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చర్చ జరిగినప్పుడు నదీ జలాలను ఇంటింటికీ ఇవ్వాలని ఒక తెలంగాణ తప్ప మరే రాష్ట్రమూ డిమాండ్ చేసే ధైర్యం చేయలేదు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తింది నాటి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే అన్న సత్యం నేటి సీఎం రేవంత్‌రెడ్డికి తెలిసినా కేసీఆర్‌పై నోరుపారేసుకోవడం అవివేకానికి పరాకాష్ట అని తెలంగాణవాదులు పేర్కొంటున్నారు. ప్రధాని మోదీ మిషన్ భగీరథ పథకాన్ని ప్రశంసించారే కానీ, దీని అమలుకు నీతి ఆయోగ్ సిఫారసు చేసిన రూ.19 వేల కోట్లు ఇవ్వకుండా మొహం చాటేశారు.
ఫ్లోరోసిస్‌పై పోరాటం ముగిసిపోలేదు. ప్రభుత్వం చూపాల్సిన స్థాయిలో శ్రద్ధ చూపడం లేదు. సురక్షితమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్ కోసం ప్రయత్నాలు చేయాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 59 మండలాలు 3,477 ఆవాస గ్రామాలకు క్రమం తప్పకుండా మిషన్ భగీరథ ద్వారా కృష్ణానది జలాలను తాగునీరుగా ఇవ్వాలి. అంగన్వాడీ కేంద్రాలు, అన్నిస్థాయిల పాఠశాలలకు, హాస్టళ్లకు సరఫరా చేయాలి. ఫ్లోరోసిస్ శాశ్వత పరిషారం కోసం తాగునీటితోపాటు శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం పూర్తిచేసి డిండి ఎత్తిపోతల ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని గొట్టిముకుల కృష్ణరాయన్పల్లి, శివన్నగూడెం ప్రాజెక్టులు సత్వరమే పూర్తిచేయాలి. యాదాద్రి- భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని మలాపురంలో ఫ్లోరైడ్, ఫ్లోరోసిస్ మెటిగేషన్ సెంటర్ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలి. పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఫ్లోరోసిస్ బాధితులకు ప్రతి నెల రూ.15 వేల పింఛన్ ఇవ్వాలి. నల్లగొండ జిల్లాలోని అన్ని వాటర్ ప్లాంట్లను మూసివేయాలి.
– డాక్టర్ కంచుకట్ల సుభాష్, రాష్ట్ర కన్వీనర్, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి