పాల్వంచ, ఫిబ్రవరి 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఉన్న పాల్వంచలోని 32వ డివిజన్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి మాలోత్ కోటేశ్వరరావు ఆదివారం ఓ కిరాణ దుకాణ యజమానిపై దౌర్జన్యానికి దిగాడు. బాధితుడి కథనం ప్రకారం… కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన గుగులోత్ రాంబాబు తరఫున కిరాణాషాపు యజమాని జగ్గు సత్యనారాయణ, అతని కుమారుడు అనిల్ ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కోటేశ్వరరావు ఓటమి పాలయ్యాడు. కోపోద్రిక్తుడైన కోటేశ్వరరావు ఆదివారం సత్యనారాయణ దుకాణం ఎదుట బైఠాయించి దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ముఖంపై ఉమ్మివేసి.. నీ సంగతి చూస్తానని బెదిరించినట్టు బాధితుడు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు షాపు యజమాని తెలిపారు.