Jangaon | జనగామ రూరల్, అక్టోబర్4 : ‘మీ ఊరెక్కడ.. ఇక్కడి దవాఖానకు ఎందుకొచ్చావ్..అక్కడికే పోయి చూయించుకో పో’ అంటూ ఓ గర్భిణికి వైద్యం నిరాకరించిన ఘటన జనగామ జిల్లా జనగామ మండలంలోని పసరమడ్ల గ్రామశివారు చంపక్ హిల్స్‌లోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకున్నది. జనగామకు చెందిన శృతికి యాదగిరిగుట్టకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. గర్భిణి కావడంతో తల్లిగారి ఊరైన జనగామకు వచ్చిన శృతి గతంలో ఇదే ఎంసీహెచ్‌లో వైద్యం చేయించుకున్నది.
శుక్రవారం వైద్యం కోసం దవాఖానకు వచ్చి ఓపీ రాయిస్తుండగా ఆధార్‌లో యాదగిరిగుట్టగా ఉండడంతో ఆమెను మీ జిల్లాకు పోయి వైద్యం చేయించుకోవాలని వైద్య సిబ్బంది చెప్పారు. తాను పుట్టింది ఇక్కడే అని, ఈ దవాఖానకు ఇతర జిల్లాల వారు రావడం లేదా? నిలదీసింది. దీంతో కోపంతో నీ జిల్లాకు పోయి చూపించుకో అంటూ దురుసుగా మాట్లాడారని బాధితురాలు తెలిపారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి పంపించారు.