Dengue | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి డెంగ్యూ ముప్పు పొంచి ఉన్నదని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తు నేతృత్వంలో వైద్యశాఖ ఉన్నతాధికారులు శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్వోలతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 2071 ప్రాంతాల్లో డెంగ్యూ విజృంభించే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. ఆయా ప్రాంతాల్లో కలిపి మొత్తం 65.62 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నట్టు చెప్పారు.
వారంతా ముప్పు అంచున ఉన్నట్టు స్పష్టంచేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్లో కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దోమల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. టీహబ్స్కు అదనంగా 42 డెంగ్యూ పరీక్షా కేంద్రాలను నిర్వహిస్తున్నామని, అన్ని బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్లను అందుబాటులో ఉంచామని వివరించారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక ప్రతిస్పందన బృందాలను నియమించినట్టు తెలిపారు.