హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ‘అక్షరరూపం దాల్చిన ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ ప్రజాకవి కాళోజీ అన్నమాటలకు తెలంగాణ అక్షరరూపం ఇచ్చింది. మలిదశ ఉద్యమంలో పెన్నేగన్నుగా పేలింది. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను అక్షరం ఏకం చేసింది. ఉద్యమకారులు, బుద్ధజీవులు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను అక్షరబద్ధం చేశారు. కవులు, రచయితలు అవ్వల్దర్జా అసలైన తెలంగాణను ఆవిష్కరించారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని అస్థిత్వమంత ఎత్తుకు తీసుకెళ్లారు. పాలకుడికి సాంస్కృతిక ధార తోడైతే పాలన పరిపుష్టి చెందుతుందని చరిత్ర చెప్పిన సత్యాన్ని గమనంలోకి తీసుకొని ఉద్యమ నాయకుడు పాలకుడైతే ఎట్లా ఉంటుందో కేసీఆర్ పదేండ్ల పాలన కండ్లకు కట్టింది. కేసీఆర్ దార్శనిక పాలన భౌతికంగా నిర్మాణాల రూపంలో, నైతికంగా ప్రజా జీవనంలో ప్రస్ఫుటం చేస్తున్నాయి.
నవంబర్ 29, డిసెంబర్ 9 దాకా 11 రోజులపాటు బీఆర్ఎస్ పార్టీ దీక్షాదివస్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2010 నుంచి 2013 దాకా దీక్షాదివస్ కార్యక్రమాలు ఉద్యమానికి పునఃశ్చరణగా నిర్వహిస్తే, 2014 నుంచి 2023 దాకా ఉద్యమస్ఫూర్తితో తెలంగాణ ప్రస్థానయాత్రను కొనసాగించారు. ఈ క్రమం లో ఏడాదిగా కాంగ్రెస్ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పదేండ్ల కేసీఆర్ పాలనలో ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిపై వందల కొద్దీ పుస్తకాలు వెలువడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీబీసీ ‘లిఫ్టింగ్ ది రివర్’ అనే డాక్యుమెంటరీతోపాటు రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కీర్తించింది.
ఆర్బీఐ, నీతిఆయోగ్ సహా అనేక జాతీయ సంస్థలు తెలంగాణ ప్రగతిని ఆకాశానికి ఎత్తాయి. కేసీఆర్ పాలనలో ఆయా సందర్భాల్లో, ఆయన చేసిన కీలక ప్రసంగాలతోపాటు ఆయన దార్శనిక విలువను తెలంగాణ కవులు, రచయితలు అక్షరబద్ధం చేశారు. పాలకుడిగా కేసీర్ పాలనా విధానాలు, వాటి పర్యవసానాలపై వచ్చినన్ని పుస్తకాలు దేశంలో మరే ముఖ్యమంత్రికి వచ్చి ఉండవని రచయితలు చెప్తున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలన పర్యవసానాలు, తెలంగాణ ఉద్యమ నేపథ్యాలను పార్టీ శ్రేణులు పునఃశ్చరణ చేసుకొని తద్వారా స్ఫూర్తి పొందాలనే ఉద్దేశంతో దీక్షాదివస్ కార్యక్రమంలో భాగంగా బుధవారం తెలంగాణభవన్‌లో బుక్‌ఫెయిర్ నిర్వహిస్తున్నారు.