హైదరాబాద్ సిటీబ్యూరో/మలక్‌పేట్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): మూసీ నిర్వాసితుల రోదన సీఎం రేవంత్‌రెడ్డి రాతి గుండెను కదిలించలేకపోయింది. అనుకున్నట్టుగానే మూసీ నిర్వాసితుల నివాసాలను కబలించి వారి బతుకులను చీకట్లోకి నెట్టేసే కుట్రకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే హైదరాబాద్‌లో మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్‌మార్క్ చేసిన ఇండ్లను మంగళవారం కూల్చివేశారు. అడుగడుగునా బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేసినా పోలీసుల పహారాలో ఇండ్లను భూస్థాపితం చేశారు. సైదాబాద్ మండలం మూసీ పరివాహక ప్రాంతంలో 150 ఇండ్లను అధికారులు నేలమట్టం చేశారు. కూల్చివేతలు ఇప్పట్లో లేనట్టేనని సన్నాయినొక్కులు నొక్కినా అధికారులు అందుకు విరుద్ధంగా మూసీలో కూల్చివేతలు ప్రారంభించి నిర్వాసితుల్లో భయాందోళనలు నింపారు. మళ్లీ ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. క్షణక్షణం తమ ఇండ్లను ఎక్కడ కూల్చివేస్తారోనని మిగిలిన నిర్వాసితులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఇప్పటి వరకు అధికారులు 1,595 నిర్మాణాలను రివర్‌బెడ్‌లో గుర్తించారు. ఇందులో 940 ఇండ్లకు ఆర్బీ ఎక్స్ మార్క్ చేసినట్టు ఆర్డీవో మహిపాల్ తెలిపారు. కాగా, మంగళవారం 150 ఇండ్లను మలక్‌పేట ఎమ్మెల్యే సమక్షంలో కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు.
గూడు నేలమట్టం
కాయకష్టం చేసుకుని కట్టుకున్న ఇండ్లు అవి. పైసాపైసా పోగుచేసి నిర్మించుకున్న గూళ్లు. పేదోడి బతుకుకు ఆధారంగా నిలిచిన నివాసాలు. ఏండ్ల తరబడి అందులో జీవించిన నిర్వాసితులు. ఏ వరదా వారిని కదిలించలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ ఇండ్లల్లోనే వారి బతుకు అని అనుకున్నరు. వాటితో పేగుబంధం ఏర్పాటు చేసుకున్నరు. అలాంటిది.. వారి ఇండ్లను వాళ్లే కూల్చుకుంటున్నారని అధికారులు ప్రకటించడం విడ్డూరంగా ఉన్నది. మలక్‌పేట ఎమ్మెల్యే సమక్షంలో నిర్వాసితులు తమ ఇండ్లను కూల్చుకున్నారని అధికారులు చెప్తున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. తమ ఇండ్లను కూల్చొద్దంటూ బాధితులు పెద్దఎత్తున నిరసన చేశారు. వారందరినీ పోలీసులు బెదిరించి అడ్డుకున్నారు. 50 మంది లేబర్లు పెద్దపెద్ద సుత్తెలు, రాడ్లతో ఇండ్లపై దెబ్బలు వేస్తూ పడగొట్టారు.
సైదాబాద్ మూసీ పరివాహక ప్రాంతం చిన్న చిన్న గల్లీలు కావడంతో అక్కడికి బుల్డోజర్లు, జేసీబీలు వెళ్లలేకపోయాయి. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేకు వివరించడంతో తాను చూసుకుంటానని అధికారులకు మాటిచ్చి పడగొట్టించారని అధికారులు అంటున్నారు. కాగా, స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యేపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తరఫున ఉంటామని మాటలు చెప్పి ఇప్పుడు అధికారులతో కలిసిపోవడం ఏమిటని కొంతమంది మహిళలు నిలదీశారు. మరోవైపు రెడ్ మార్క్ ఉన్న కొన్ని ఇండ్లను కూల్చకుండా బాధితులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి అధికారులు నిష్క్రమించారు. బుధవారం గాంధీ జయంతి కావటంతో కూల్చివేతలకు బ్రేక్ ఉండనున్నట్టు సమాచారం. మళ్లీ మిగిలిన రెడ్ మార్క్ ఇండ్లను గురువారం నుంచి కూల్చేందుకు అధికారులు సిద్ధం కానున్నారు.
మాతోనే మా ఇండ్లు కూల్చి వేయించారు!
అధికారులు ముందుగా తాత్కాలిక కూల్చివేతలు (లేబర్‌తో ఇంటి పైకప్పులు, దర్వాజలను తొలగింపు పనులు) చేపట్టడంతో తమ సామాన్లు తీసుకునే అవకాశం కల్పించాలని కొందరు బాధితులు అధికారులను కోరటంతో సరేనన్నారు. దాంతో కొందరు పనివాళ్లు కూల్చివేస్తుంటే సామాన్లను తీసుకోగా, కొందరు తామే తీసుకుంటామని, తాము తీసుకున్న తర్వాత కూల్చివేతలు చేపట్టాలని కోరటంతో అధికారులు అవకాశం కల్పించారు. రేకులు, తలుపులు, వాటి ఫ్రేమ్‌లు, కిటికీలు, గ్రిల్స్ తదితర సామగ్రిని బాధితులు తీసుకొని వాహనాల్లో తరలించుకుపోయారు. చెమటోడ్చి.. రూపాయి, రూపాయి పోగేసి ఇండ్లు కట్టుకుంటే తమతోనే తమ ఇండ్లు కూల్చి వేయిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
శంకర్‌నగర్‌లో ఉద్రిక్తత
కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ పాత మలక్‌పేట డివిజన్లోని శంకర్‌నగర్‌లోని మూసీ రివర్ బెడ్లో పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీశాయి. షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి, హిమాయత్‌నగర్ తహసీల్దార్ సంధ్యారాణి, వెస్ట్ మారేడ్‌పల్లి తహసీల్దార్ భీమయ్యగౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన కూల్చివేతలు బస్తీవాసులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలు ఇచ్చి నివాసాలను ఖాళీ చేయించిన అధికారులు మంగళవారం శంకర్‌నగర్‌లో కూల్చివేతలు చేపట్టేందుకు వెళ్లగా శంకర్‌నగర్ బస్తీవాసులు అధికారులను అడ్డుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఓటేస్తే మా జీవితాలను బర్బాద్ చేసిండు. ఐదు రోజుల నుంచి నీళ్లు లేవు, తిండిలేదు, ఇండ్లలో పాచిపనులు చేసి ఓ ఇల్లు కట్టుకున్నం. దానినీ కూల్చివేసిండు. ఇప్పుడు మమ్మల్ని రోడ్లమీద నిలబెట్టిండు. మా బతుకులను ఆగం జేసిండు. ఇప్పటికైనా మా ఇల్లు మాకు ఇస్తే, ఎంత కష్టమైనా మళ్లీ కట్టుకుంటం. ఇంకెక్కడికీ పోయేది లేదు.
– చాంద్‌బీ, శంకర్‌నగర్ బాధితురాలు
కేసీఆర్ సారు చీరలిచ్చిండు.. రేవంత్ ఇల్లు కూలగొట్టిండు
మార్పు.. మార్పు.. అని చెప్తే నమ్మి ఓటేస్తే ఈ రేవంత్‌రెడ్డి మమ్మల్ని నడిమిట్ల బొందపెట్టిండు. రెక్కలు ముక్కలు జేసి కట్టుకున్న ఇంటిని కూలగొట్టేసిండు. మా బతుకే కూలిపాయె.. ఇగ బతుకమ్మ ఎట్లాడాలె? తెలంగాణ అచ్చినప్పటి సంది ఈ దినం అచ్చిదంటే అందరం ఈ చెరువుకాడనే బతుకమ్మ ఆడేది. కేసీఆర్ సారు చీరలు పంచేది. పది దినాలు సంబురాలు ఉంటుండె. రేవంత్‌రెడ్డి అచ్చినకాడినుంచి రాష్ట్రాన్ని సర్వనాశనం జేత్తున్నడు. కేసీఆర్ సారు లెక్క రైతుబంధు ఇయ్య చేతగాదు. రుణమాఫీ చెయ్య ముఖం లేదు. దరిద్రమైన పనులు జేయమంటే ఫస్ట్ ఉంటడు. ఇంతమంది పేదోళ్ల ఏడుపు మంచిది గాదు.. ఇంతకింత అనుభవిస్తడు.
– తార, సున్నం చెరువు హైడ్రా బాధితురాలు
మా ఉసురు తగిలిపోతాడు
నాకు భర్త లేడు. 8 మంది కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నలుగురికి పెండ్లిళ్లు చేసిన. మిగతావారికి చేయాల్సి ఉన్నది. మేమంతా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నం. ఇంట్లో ఐదు గదులు ఉన్నాయి. ఇంత పెద్ద ఇంటిని కూల్చివేసి డబ్బాలాంటి డబుల్ బెడ్రూం ఇచ్చారు. అందులో మేమెలా ఉండేది? వాడికి మా ఉసురు తగిలిపోతాడు.
-ఫాతిమా బీ, శంకర్‌నగర్ బాధితురాలు
మా కుటుంబాన్ని విడదీశాడు
ఇక్కడ మేం 20 ఏండ్ల నుంచి ఉంటున్నాం. మొ త్తం ఏడుగురం ఉంటు న్నం. ఈ ఇంటిని కూల్చివేసి చంచల్‌గూడలో డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చారు. అందులో సగం మందే పడుతున్నారు. మిగతావారి కోసం ఓ పోర్షన్ అద్దెకు తీసుకున్నాం. కుటుంబాన్ని విడదీశాడు.
-అబ్దుల్ రహీం, శంకర్‌నగర్ బాధితుడు
మార్కింగ్ చేశారు.. ఇల్లు ఇవ్వలేదు
ఈ ఇల్లు మా నాన్న ఇచ్చాడు. నాలుగేండ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం. అధికారులు మా ఇంటికి వచ్చి ఆధార్‌కార్డు, కరెంట్ బిల్లు అన్నీ తీసుకున్నారు. ఇల్లు ఇస్తామని చెప్పి ఆర్బీ ఎక్స్ అని ఇంట్లో గోడపై మార్కింగ్ చేశారు. కానీ ఇల్లు ఇవ్వలేదు. ఇంటిముందు గోడ కూలింది. దాన్ని సాకుగా చూపి ఇల్లు ఇవ్వటం లేదు.
-అస్మా బేగం, మూసానగర్ బాధితురాలు