వేములవాడ, జూన్ 17: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా కూల్చివేతలు మూడోరోజు మంగళవారం కూడా కొనసాగాయి. మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు 80 అడుగుల మేర రోడ్డును విస్తరిస్తుండగా, దారి వెంట 243 మంది తమ దుకాణాలు, ఇండ్లు కోల్పోతున్న విషయం తెలిసిందే. పలువురు నిర్వాసితులు కోర్టుకు వెళ్లగా, వారి భవనాలు మినహా మిగిలినవారి ఇండ్లు, దుకాణాలను కూల్చివేస్తున్నారు.
ముదిరాజ్ వీధి నుంచి మటన్ మారెట్ వరకు రెండు, మూడు అంతస్థుల్లో భవనాలు ఉండగా హిటాచి వాహనాలతో నేలమట్టం చేస్తున్నారు. ఎస్పీ మహేశ్, అదనపు ఎస్పీ చంద్రయ్య పనులను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ అన్వేష్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కూల్చివేతలతో ప్రధాన రహదారికి ఇరువైపులా మట్టి దిబ్బలు, శిథిలాలు పేరుకుపోవడం, భారీగా దుమ్ముధూళి ఎగిసిపడుతుండడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారిలో ఏపుగా పెరిగిన చెట్లను సైతం నేలమట్టం చేయడంపై ప్రకృతి ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.