రామగిరి, జనవరి 6: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారంపేట గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. సింగరేణి ఆర్జీ-3 పరిధి ఓసీపీ-2 విస్తరణలో భాగంగా సింగరేణి యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే భూసేకరణ పనులను ప్రారంభించడంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కలెక్టర్ శ్రీహర్ష, రెవెన్యూ, సింగరేణి అధికారుల సమక్షంలో అక్రమ కట్టడాల నెపంతో గ్రామంలో పలువురి ఇండ్లను కూల్చివేయగా, బాధితులు మంథని-పెద్దపల్లి ప్రధాన రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారని ప్రశ్నించారు. కలెక్టర్ దగ్గరుండి కూల్చివేతకు ఆదేశాలిచ్చారని ఆరోపించారు. ఆయనే వచ్చి సమాధానం చెప్పేవరకు ఆందోళనన విరమించబోమన్నారు. ధర్నాతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గోదావరిఖని ఏసీపీ రమేశ్ ఘటనాస్థలికి వచ్చి బాధితులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.