నందికొండ, అక్టోబర్ 4 : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పైలాన్‌కాలనీలో పట్టణ బీఆర్ఎస్ మాజీ కార్యదర్శి ముడావత్ లక్ష్మణ్ నాయక్ నిర్మిస్తున్న ఇంటిని మున్సిపల్ కమిషనర్ శ్రీను, సూపర్వైజర్ శివ తమ సిబ్బందితో కలిసి శుక్రవారం కూల్చి వేశారు. తాము ఇంటి నిర్మాణం చేపడుతున్న స్థలంలో 50 ఏండ్లకుపైగా నివాసం ఉంటున్నామని ఇంటి యజమాని ముడావత్ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ఇంటి పక్కన దారి విషయమై స్థానికులు అభ్యంతరం చెప్పడంతో గత నెల 27న పెద్దల సమక్షంలో మాట్లాడి ఇంటి నిర్మాణ పనులను కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. కానీ అధికారులకు తమకు సమాచారం ఇవ్వకుండానే నిర్మాణ గోడలను కూల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే కూల్చివేతలు చేపట్టారని లక్ష్మణ్ ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట బాధితుడు లక్ష్మణ్‌నాయక్ కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు.
టౌన్ ప్లానింగ్ అధికారికి ముందస్తు బెయిల్
హైదరాబాద్, అక్టోబర్ 4, (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా నిజాంపేట ప్రగతినగర్‌లోని ఎరక్రుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలకు అనుమతించారన్న కారణంగా హైడ్రా నమోదు చేసిన కేసులో హెచ్ఎండీఏ అసిస్టెంట్ టౌన్‌ప్లానింగ్ అధికారి సుధీర్‌కుమార్‌కు హైకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. హైడ్రా ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో సుధీర్‌కుమార్‌కు షరతులతో ముందస్తు బెయిలు మంజూరు చేసింది. హైడ్రా ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఎన్ సుదాంశ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు.