మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని పదిహేనేండ్లయింది. పానం బాగలేక మేం దవాఖానల ఉంటే రాత్రికిరాత్రే వచ్చి మా ఇల్లు కూలగొట్టిండ్రు. మేమిద్దరం దివ్యాంగులం. అప్పు సప్పు చేసి ఇల్లు కట్టుకున్నం. అది కూడా లేకుండ చేసిండ్రు. మాకు అన్యాయం చేసిండ్రు. మా ఇంట్ల సామాన్లు అట్లనే ఉన్నయ్. బియ్యం, బట్టలు అన్నింట్ల మన్నువడ్డది. మేం రోడ్డున పడ్డం. సామాన్లు ఉండంగనే కూలగొడితె ఎట్ల. ఆడపిల్లలతోని ఏడికిపోవాలె? ఏంజెయ్యాలె? ఇంటి ట్యాక్స్ కట్టినం. ఎందుకు కూలగొట్టిండ్రో అర్థమైతలేదు. ఏం చెప్పకుండ రాత్రిపూట వచ్చి కూలగొట్టుడు ఏం పద్ధతి?
Mahabubnagar | మహబూబ్‌నగర్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈ రోజు గడిచిందని గుండెపై చెయ్యేసుకొని పడుకున్న ఆ పేదలు.. ఈ ప్రజాపాలనలో అదే కాళరాత్రి అవుతుందని ఊహించలేదు! తమ బతుకులు బాగుపడుతాయేమోనన్న భ్రమతో గెలిపించిన ఇదే కాంగ్రెస్, తమను రోడ్డు పాలుజేస్తుందని కలగనలేదు! 15 ఏండ్ల కిందట ఇదే కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన పట్టాలతో కట్టుకున్న ఇండ్లను ఇంత నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తుందని అస్సలనుకోలేదు! ఎలాంటి నోటీసులు లేకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో దిగిన అధికారయత్రాంగం తెల్లవారుజాము వరకు ఏకంగా 75ఇండ్లను కూల్చడంతో వందలాది మంది బతుకులు రోడ్డున పడ్డాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో రెవెన్యూ అధికారులు రెచ్చిపోయారు. రాష్ట్ర రాజధానిలో హైడ్రా పేరిట జరుగుతున్న కూల్చివేతల పర్వాన్ని పాలమూరులోనూ ప్రత్యక్షంగా చూపించారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని ఆదర్శనగర్‌లో 15 ఏండ్ల కిందట కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో కట్టుకున్న 75 ఇండ్లను ఎలాంటి నోటీసులు లేకుండా, ఆక్రమణలు అని తేల్చకుండా పోలీసు బందోబస్తు నడుమ నిశిరాత్రి నేలమట్టం చేశారు. బాధితులు నెత్తీనోరు బాదుకుంటూ కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. కూల్చినవాటిలో అంధులు, దివ్యాంగుల కుటుంబాలకు సంబంధించి 25 ఇండ్లు ఉన్నా దయ చూపలేదు. తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమైన కూల్చివేతల పర్వం ఉదయం 6 గంటల వరకు ఏకధాటిగా సాగింది. తెల్లారేసరికే పేదల కలల సౌధాలు కండ్లముందే కూలిపోయాయి.
పాలమూరు కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోనే ఆదర్శనగర్ ఉన్నది. ఎవరి ఆదేశాల మేరకు వచ్చారో తెలియదు కానీ రెవెన్యూ, పోలీసు సిబ్బంది హఠాత్తుగా బుధవారం అర్ధరాత్రి తర్వాత బుల్డోజర్లతో ప్రత్యక్షమయ్యారు. పడుకున్నవారిని లేపి గురువారం తెల్లవారు జాము నుంచి కనిపించిన ఇంటినల్లా కూల్చేయడం మొదలుపెట్టారు. బాధితులు ఎవరూ దగ్గరికి రాకుండా పోలీసులను మోహరించారు. కొందరు శుభకార్యాల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లినవారంతా సమాచారం తెలిసి హుటాహుటిన పరిగెత్తుకొచ్చి కూలిన తమ ఇండ్లను చూసి లబోదిబోమన్నారు. మొండి గోడలను పట్టుకొని రోదించారు. మట్టిపెల్లల మధ్య మిగిలిన సామాన్లు తీసుకొని కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఓ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్టు తెలుస్తున్నది.
మహబూబ్‌నగర్‌లోని 523 సర్వే నంబర్లో సుమారు 90 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నది. ఇందులో 30 శాతం భూమిలో గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందించింది. 15 ఏండ్ల కిందట సుమారు 2,000 మందికిపైగా ఇండ్లు లేని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల పట్టాలు అందించింది. అప్పట్లో కంప చెట్లతో ఎగుడు దిగుడు స్థలాలు ఉండడంతో ఇండ్లు కట్టుకోలేక చాలా మంది ఖాళీగా ఉంచారు. కలెక్టర్ రొనాల్డ్‌రాస్ వచ్చాక చాలామంది అనర్హులున్నారని గుర్తించి కొందరి పట్టాలను రద్దుచేశారు. ఆ తర్వాత 500 మందిని అర్హులుగా ప్రకటించి మళ్లీ పట్టాలు ఇచ్చారు. ఇదేఅదనుగా రెవెన్యూ సిబ్బంది సహకారంతో కొందరు దళారులు పెద్ద ఎత్తున ఆదర్శనగర్‌లో పట్టాలు సృష్టించి స్థలాలు విక్రయించారు. రూ.లక్షలు పెట్టి పేదలు కొనుగోలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను బీఆర్ఎస్ సర్కారు కొనసాగించింది. ఎలాంటి చర్యలు తీసుకోకుండా నివాసయోగ్యం కల్పించింది. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పేదల ఇండ్లపై ప్రతాపం చూపింది.
పట్టణంలో సర్వే నంబర్ 523లోని మూడెకరాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు తేల్చామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తొలగించామని అర్బన్ తహసీల్దార్ ఘన్సీరాం వెల్లడించారు. స్థానిక కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు.
ఆదర్శనగర్‌లో తమ ఇండ్లను కూల్చివేయడంతో బాధితులంతా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం లేకుండా తమ ఇండ్లను కూల్చివేశారని మండిపడ్డారు. తిరిగి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, నష్టపరిహారం కింద రూ.5 లక్షలు ఇవ్వాలని, కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని ఓట్లేసినం.. చివరికి ఆ ప్రభుత్వం చేసిన ఘన కార్యమిది’ అంటూ కన్నీరుపెట్టారు. బాధితులెవరినీ అధికారులను కలవనీయకుండా పోలీసులు కట్టడి చేయడంతో చేసేది లేక బాధితులంతా వెనుదిరిగారు.
ఇండ్లు నేలమట్టమైన బాధితుల్లో మరుగుజ్జులు, దివ్యాంగులు, చివరికి అంధులు కూడా ఉన్నారు. వీరికి చెందిన 25 ఇండ్లను కూడా అధికారులు కూలగొట్టరు. ‘గత ప్రభుత్వం ప్లాట్లుగా ఇచ్చిన భూముల్లోనే మా రక్తాన్ని చెమటగా ధారబోసి కట్టుకున్న ఇండ్లను ఒక్క రాత్రిలో కూలగొట్టిండ్రు’ అంటూ వారు కుమిలిపోతున్నారు. తమ దగ్గర ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నాయని వాటిని చూపిస్తూ ఆందోళన చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలనకు రాగా ఆయన ఎదుట ఒక్కో బాధితుడు వచ్చి తమ గోడును వెల్లగక్కారు.
‘దివ్యాంగులు, అంధులు అని కూడా చూడకుండా వారి ఇండ్లను కూలగొట్టారు. ఇండ్లు కూల్చితే పేదలు ఎక్కడ ఉండాలె అన్న ఆలోచన కూడా చేయకపోవడం దారుణం’ అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం సాయంత్రం ఆదర్శనగర్‌లో కూలిన ఇండ్లను ఆయన పరిశీలించారు. విచారణ జరపకుండా, ఎలాంటి నోటీసులివ్వకుండా కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. బాధితులకు కూల్చిన చోటే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసానిచ్చారు. రోడ్డునపడ్డ పేదలకు వసతి, భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ దొంగ పట్టాలుంటే వీళ్లకు పట్టాలిచ్చిన వారిపై కేసులు పెట్టాలని, పేదలకు అన్యాయం చేయడం తగదని చెప్పారు.
నా భర్త కాంగ్రెస్ మనిషి.. మా కాంగ్రెస్ అనుకుంట ఆ పార్టీలో తిరుగుతడు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టే మాకు ఉండనీకి గూడు లేకుండజేసింది. నా కుడికాలు విరగడంతో రాడ్డు వేసిండ్రు. ఇబ్బంది అయితే నిన్న దవాఖానకు పోయిన. డాక్టర్లు పరీక్షలు చేసిండ్రు. టెస్టులు వచ్చాక ఏం చెప్తరో అని అక్కన్నే ఉన్న. పక్క ఇంటోల్లు ఫోన్ చేసి మీ ఇల్లు కూలగ్గొట్టిండ్రు అని చెప్పంగనే గుండెల బండ వడ్డట్టయ్యింది. ఇక్కడికి వచ్చి చూసినంక దుఃఖం ఆగలే. ఎంత ఏడిస్తే ఏం లాభం. మొండి గోడలు మిగిలియన్. కడుపుమాడ్చుకొని కట్టుకున్న ఇంటిని కూలగొట్టిండ్రు.. వీళ్ల శేతులకు జెట్టలువుట్ట.