Congress Govt | మేడ్చల్, హైదరాబాద్ జూలై 8 (నమస్తే తెలంగాణ): అన్ని అనుమతులూ ఉన్నాయి. స్థలాల క్రమబద్ధీకరణ కూడా జరిగింది. రెవెన్యూ అధికారులు ఎన్వోసీ కూడా ఇచ్చారు. మున్సిపాలిటీ కూడా ఓకే చెప్పింది. గృహరుణాలకు అనుమతి కూడా లభించింది. అయినా సరే కేవలం రాజకీయ కక్ష వేధింపుల్లో భాగంగా ఓ కాంగ్రెస్ నేత కనుసన్నల్లో ఎంపిక చేసుకొని మరీ ఆ ఇళ్లను కూల్చివేశారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో సోమవారం వందల మంది పోలీసుల పహారాలో యథేచ్ఛగా ఇండ్లను పడగొట్టారు. కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ సర్వే నంబర్ 1లో అనేకమంది 30-40 ఏండ్ల కిందటే ప్లాట్లు కొనుగోలు చేశారు. వీటిని 2008లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసింది. రెవెన్యూ అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. గృహ రుణాలు తీసుకునేందుకు వీలు కల్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వీరికి ఎలాంటి చిక్కులు లేకుండా ఉండేలా ఆ ప్లాట్లను 118 జీవో పరిధిలో చేర్చి, ప్లాట్ల యజమానులకు మేలుచేసింది.
దాదాపు 300 మందికి పైగా నిరుపేదలు, చిరుద్యోగులు ఇండ్ల నిర్మాణం చేపట్టారు. కాగా, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మార్గదర్శనంలో సోమవారం తెల్లవారుజామున ఐదింటికే ఆ ఇండ్లను నేలమట్టం చేశారు. తహసీల్దారు హసీనా ఆధ్వర్యంలో కూల్చివేతల పర్వం జరిగింది. ఇక్కడ వందల ఇండ్లను నిర్మిస్తున్నా అధికారులు సీలింగ్‌ల్యాండ్ ఉందంటూ కొన్నింటినే లక్ష్యంగా చేసుకొని కూల్చివేతలు మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు, కాలనీవాసులు, ప్రజలు సంఘటనాస్థలానికి వెళ్లి, అడ్డుకునే ప్రయత్నం చేశారు. మేయర్ జక్కా వెంకట్‌రెడ్డిని కిందపడేసి లాక్కెళ్లి పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. బీఆర్ఎస్ నేత బండారి రవీందర్, కార్పొరేటర్లు కొల్లూరి మహేశ్, బచ్చ రాజు, మద్ది యుగేందర్‌రెడ్డి, కౌడె పోచయ్య, అనంతరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, దొంతిరి హరిశంకర్‌రెడ్డి, నాయకులు రఘుపతిరెడ్డి, బండి సతీశ్‌గౌడ్, దేవేందర్‌గౌడ్, రఘువర్ధన్‌రెడ్డి, జావీద్‌ఖాన్ తదితరులు కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించారు.
కాంగ్రెస్ వేధింపులకు వడ్డీతో సహా చెల్లిస్తాం: కేటీఆర్
కూల్చివేతల విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను వడ్డీతో సహా చెల్లిస్తామని, ప్రజాపరిపాలన పేరుతో ప్రజల ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నదని ఎక్స్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ నాయకులు అమ్మిన, కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించిన ప్లాట్లలో నిర్మించుకున్న ప్రజల ఇండ్లను మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఏమి ఆశించి ఈ రోజు కూలగొట్టించాడో సీఎం రేవంత్‌రెడ్డి ఒకసారి విచారణ చేయించాలి. ప్రజలకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు నిర్బంధించడం అరాచకం. మీకు అన్నగా ప్రచారం చేసుకుంటూ మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో సుధీర్‌రెడ్డి చేస్తున్న అరాచకాలపై మీరు ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోండి. లేదంటే ప్రజలు తిరగబడుతారు.
మీ నిర్బంధాలు ప్రజాగ్రహాన్ని నిలువరించలేవు. అమాయక ప్రజలకు ఈ ప్లాట్లు అమ్మింది కాంగ్రెస్ నాయకుడు రాందాస్‌గౌడ్, మరో కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్‌సింగ్ కుటుంబం. ఈ ప్లాట్లను 2008 నాటి సీఎం రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. రెవెన్యూ అధికారులు ఇది పట్టాభూమిగా గతంలోనే ఎన్వోసీ జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మున్సిపాలిటీ అధికారుల అనుమతి తీసుకొని చాలామంది ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొన్నారు. ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అధికారులను వేధించి అమాయకుల ఇండ్లను కూలగొట్టించాడు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయిప్రియ, సత్యనారాయణపురం కాలనీ ప్లాట్ల యజమానుల సమస్యను శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 118 జీవో పరిధిలో చేర్చి, ప్లాట్ల యజమానులకు మేలుచేసింది.
కానీ ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం అమాయక ప్లాట్ల యజమానుల ఇండ్లను కూల్చివేస్తున్నది. ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి వేధింపులకు పాల్పడుతున్నది. దీనికి ముగింపు పలకడం ఖాయం. భవిష్యత్తులో మా బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్లాట్ ఓనర్లకు కచ్చితంగా న్యాయం చేస్తాం. మా బీఆర్ఎస్ పార్టీ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డిని, కార్పొరేటర్లను మీరు వేధిస్తున్నారు. మేము ఇలా వేధించాలి అనుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోయేది. కాంగ్రెస్ వేధింపులకు వడ్డీతో సహా చెల్లిస్తాం. మా నాయకులను, మా మేయర్, మా కార్పొరేటర్లను కంటికి రెప్పలా కాపాడుకుంటాం’ అని పేర్కొన్నారు.
పేదల ఇండ్లు కూల్చుడే కాంగ్రెస్ లక్ష్యమా?: ఈటల
పేదలపై దండయాత్రలు, ఇండ్లను కూల్చివేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమా? అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఉప్పల్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయిప్రియ ఎన్‌క్లేవ్‌లో కూల్చివేతలపై స్పందించారు. బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాయిప్రియ ఎన్‌క్లేవ్‌లో నిరుపేదలు ఉన్నారని, వారి ఇండ్లకు అన్నిరకాల అనుమతులు ఉన్నా ప్రభు త్వం అకారణంగా కూల్చివేసిందని మండిపడ్డారు. అవి అక్రమ భూములు అయితే ఆనాడు ఇండ్ల నిర్మాణానికి, గృహ రుణాలకు ఎలా అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అధికారులే అప్పట్లో అనుమతులు ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వాలు మారవచ్చుగానీ అధికారులు మారొద్దని హితవు పలికారు. ఈ అంశంపై కలెక్టర్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని, డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మం త్రులను అడిగితే తమకు తెలియదంటూ తప్పించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు క్షమాపణ చెప్పి పరిహారం ఇవ్వాలని డి మాండ్ చేశారు. కాంగ్రెస్ వైఖరి వల్ల 300 మం ది రోడ్డునపడ్డారు. కాంగ్రెస్ ఒళ్లు వంచి అధికారంలోకి రాలేదని, బీఆర్ఎస్ను ఓడించాలని మాత్రమే ప్రజలు ఓటేశారని ఎద్దేవా చేశారు.
దమ్ముంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడాలి
మున్సిపాలిటీ అవిశ్వాసం నెగ్గలేక మొన్న కిడ్నాప్‌లు చేసి, నిన్న తప్పుడు కేసులు పెట్టి, నేడు అమాయక ఇండ్లపై దాడులకు పాల్పడుతున్న సుధీర్‌రెడ్డికి నిజంగా దమ్ముంటే ప్రజా క్షేత్రంలో కొట్లాడాలి. అంతేకానీ ఇలా దొడ్డి దారిలో ప్రజాప్రతినిధులను భౌతికంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టం కలిగించి, హింసించాలనుకోవటం సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వపు వేధింపులకు వడ్డీతో సహా చెల్లిస్తాం. అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటాం. ప్రజల తరుపున పోరాటం కొనసాగిస్తాం.
– జక్క వెంకట్‌రెడ్డి, మేయర్, పీర్జాదిగూడ