కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాల్లో చెక్‌డ్యాంలు పేల్చినట్టే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌ను కూల్చారనే అనుమానం ఉన్నది. బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు మానేరు, మంజీరా నదులపై కేసీఆర్ 1,200లకు పైగా చెక్‌డ్యాంలు కడితే.. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వాటిని కూల్చివేస్తున్నడు. కేసీఆర్ హయాంలో కరీంనగర్-పెద్దపల్లి జిల్లాల సరిహద్దు తనుగుల వద్ద రూ.24కోట్లతో నిర్మించిన చెక్‌డ్యాంను కాంగ్రెస్ ఇసుక మాఫియానే కూల్చేసింది. గతంలో ఇదే పెద్దపల్లి జిల్లాలోని హుస్సేన్‌మియా వాగుపై చెక్‌డ్యాంను కూల్చే కుట్ర చేస్తే రైతులు గమనించడంతో ప్రమాదం తప్పింది.
– హరీశ్‌రావు
కరీంనగర్, నవంబర్ 25(నమస్తే తెలంగాణ): చెక్‌డ్యాంలు పేల్చినట్టే మేడిగడ్డను కూడా కూల్చారనే అనుమానాలు కలుగుతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మధ్య తనుగుల వద్ద మానేరు నదిపై మూడు రోజుల కింద కూల్చివేసిన చెక్‌డ్యాంను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్‌తోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నాయకులు, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. జమ్మికుంట మండలం తనుగుల వద్ద మానేరు వాగులో రూ.24కోట్లతో నిర్మించిన చెక్‌డ్యాంను ఇసుక మాఫియా పేల్చేసిందని ఆరోపించారు. నీళ్లుంటే ఇసుక తవ్వకాలకు ఆటంకమని, రాత్రికిరాత్రే జిలెటిన్‌స్టిక్స్‌తో డ్యాంను కూల్చారని స్పష్టం చేశారు. దీని వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉన్నదని ఆరోపించారు. కూల్చడం తప్ప కట్టడం రేవంత్‌రెడ్డికి చేతకాదని ధ్వజమెత్తారు.
చెక్‌డ్యాంను ఇసుక మాఫియా కూల్చినట్టు స్పష్టంగా తెలుస్తున్నా కొందరు బుకాయిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాణ్యతాలోపంతోనే కూలిందని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ చెక్‌డ్యాం కట్టింది మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీయేనని స్పష్టం చేశారు. నాణ్యతాలోపంతో కూలిపోతే ఆ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా కూల్చిందే నిజమైతే బాధ్యులను అరెస్ట్ చేసి, రూ.24కోట్లు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
గ్రామాల్లో ఇసుక మాఫియా రూపంలో చెక్‌డ్యాంలను, హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చుతున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పదేళ్లలో కేసీఆర్ రాత్రీపగలు కష్టపడి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, చెక్‌డ్యాంలు కట్టించారని, చెరువులను పునరుద్ధరించారని, 24గంటల కరెంట్ ఇచ్చారని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు తెస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఒక్క చెక్‌డ్యాం కూడా కట్టలేదని విమర్శ గుప్పించారు. కాంగ్రెస్ నాయకులు టెర్రరిస్టులను మించి నీటి వనరులను ధ్వంసం చేస్తున్నారని ఆక్షేపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందంటున్న రేవంత్‌రెడ్డి మల్లన్నసాగర్ నుంచి రూ.8వేల కోట్లు ఖర్చు చేసి నీటిని తీసుకెళ్లి మూసీని ప్రక్షాళన చేస్తామని చెబుతున్నారని, ఈ ప్రాజెక్టేమైనా రేవంత్‌రెడ్డి తాత కట్టారా? అని ప్రశ్నించారు. హరీశ్‌రావు వెంట దాసరి మనోహర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జీవీ రామకృష్ణారావు, తక్కళ్లపల్లి ఉన్నారు.
గతంలో పెద్దపల్లి జిల్లాలోని హుస్సేన్‌మియా వాగుపై చెక్‌డ్యాంను కూల్చేసేందుకు యత్నించిన ముఠాను స్థానిక రైతులు పట్టుకుని, ఆధారాలతో పోలీసులకు అప్పగించినా స్థానిక ఎమ్మెల్యే సహకరించడంతో బాధ్యులపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని హరీశ్ మండిపడ్డారు. అప్పుడు శిక్షిస్తే ఇప్పుడు మానేరుపై చెక్‌డ్యాంను కూల్చేందుకు సాహసించే వారు కాదని పేర్కొన్నారు. ఎల్ఎండీ రిజర్వాయర్ నుంచి 14గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని వదిలినా చెక్కు చెదరని చెక్‌డ్యాం, రాత్రికి రాత్రి ఎట్లా కూలుతుందని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి అండతో కాంగ్రెస్ నాయకులే ఇసుక మాఫియాగా అవతారమెత్తి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతున్నదని, మంత్రులకూ వాటా అందుతున్నదని ఆరోపించారు.