హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : ఎమర్జెన్సీ కష్టకాలం నుంచి బయటకు వచ్చిన తర్వాతే భారత ప్రజాస్వామ్యం మరింత బలోపేతమైంది అని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా అభివర్ణించారు. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులకు కారణమైన వారిని జవాబుదారిగా నిలబెట్టాలని డిమాండ్ చేశారు. ‘సరిగ్గా 50 ఏండ్ల క్రితం 1975 జూన్ 12న ఎంపీగా ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని పేర్కొంటూ, ఆమెను ఆరేండ్లపాటు అనర్హురాలిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది.
విచారణ చేపట్టిన తర్వాత ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ఎన్నిక చెల్లదని తీర్పు ఇవ్వడం స్వతంత్ర దేశంలో అదే మొట్ట మొదటిసారి. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్‌లోని ఫాసిస్టు, నియంతృత్వ పోకడలు బయటకు వచ్చాయి. దీని కారణంగా రెండు వారాల తర్వాత దేశ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయమైన ‘ఎమర్జెన్సీ’ మొదలైంది’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.