హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వివిధ రంగాల కార్మికులు, విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ధర్నాలు నిర్వహించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు తీసి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్‌యూ, ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. పింఛన్లు పెంచాలని, సాగు భూములకు పట్టాలివ్వాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరారు.
చేనేత సమస్యలు పరిష్కరించాలి
చేనేత సమస్యలను పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ చేనేత సహకార సంఘం వద్ద చేనేత కార్మిక సంఘం నాయకులు ధర్నా చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిఫ్ట్ పథకం నిలిపివేశారని, ముద్ర రుణాలు, మార్కెట్ సౌకర్యం కల్పించడం లేదని, బునకర్ యోజన పథకాన్ని తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత నాయకులు మాచర్ల కృష్ణ, గంజి శ్రీనివాస్, జయశంకర్, మధు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
టీచర్ల కోసం పాఠశాలకు తాళం వేసి నిరసన
ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుర్వపల్లి కొత్తూరు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేపట్టారు. గతంలో పనిచేసిన ముగ్గురు ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా.. ఐదు తరగతులకు ఒక్కరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారని, ఏజెన్సీ ప్రాంతంలోని పాఠశాలపై చిన్నచూపు చూడకుండా వెంటనే ఉపాధ్యాయులను కేటాయించాలని డిమాండ్ చేశారు.
సాగు భూములకు పట్టాలివ్వాలివ్వాలని ఆందోళన
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ సమీపంలోని సర్వే నం. 718లో సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు అందించాలని 30 మంది దళితులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. వ్యవసాయ వృత్తిదారుల, తెలంగాణ సర్వీస్ వర్కర్స్ యూనియన్లు మద్దతుగా నిలిచాయి. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య, నాయకులు నాగన్న, జంబులయ్య, వెంకటేశ్వరమ్మ, స్వాతి, నర్సింహులు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ఆందోళన
కేంద్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు, రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేల ఆర్థిక సాయం అదించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంవీఐ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. సంఘం బాధ్యులు జిల్లా ఉపేందర్, రాందాస్, సాగర్, నాగేశ్వరరావు, రమేశ్, నర్సయ్య, లక్ష్మణ్, బాలాజీ, రవి, సైదులు, సతీశ్, నరేశ్ పాల్గొన్నారు.
సూపర్వైజర్లు బూతులు తిడుతున్నారు!
సూపర్వైజర్లు తమను బూతులు తిడుతున్నారని సచివాలయ హౌజ్‌కీపింగ్ సిబ్బంది, స్వీపర్లు సోమవారం ఆందోళనకు దిగారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. కొందరిని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్(సీఎస్‌వో)దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడించారు.
పింఛన్లు పెంచాలని వామపక్షాల ధర్నా
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు జీవనభృతి రూ.4 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తహసీల్ కార్యాలయాల ఎదుట ఐఎఫ్టీయూ, సీపీఎం ఎంఎల్ (మాస్‌లైన్) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని, స్థలమున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.10 లక్షల రుణం ఇవ్వాలని కోరారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు సోమవారం శంషాబాద్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
గృహజ్యోతితో ఉపాధి కోల్పోయాం.. ఆదుకోండి
గృహజ్యోతితో ఉపాధి కోల్పోయిన తమకు ఉపాధి కల్పించాలని బిల్ కలెక్టర్లు హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ధర్నాచౌక్‌లో నిరసనకు దిగారు.
రేవంత్ ప్రభుత్వానికి మూల్యం తప్పదు: పీడీఎస్‌యూ
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలోని కాల్వొడ్డు నుంచి ట్రాఫిక్ పోలీసుస్టేషన్ వరకు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం నాయకులు అదనపు కలెక్టర్ మధుసూదన్‌కు వినతిపత్రం అందించారు.