ఆమనగల్లు, నవంబర్ 28 : గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం పేరిట తమ భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని భూ నిర్వాసితులు అధికారులకు అల్టిమేటం జారీచేశారు. గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి, సాకిబండతండా, మూర్తూజపల్లి శివారు, మాలేపల్లిలో భూములు కోల్పోతున్న నిర్వాసితులతో శుక్రవారం ఆకుతోటపల్లి రైతు వేదిక, సాకిబండతండాల్లో గ్రామసభలు నిర్వహించారు. రంగారెడ్డి అదనపు కలెక్టర్(రెవెన్యూ) చంద్రారెడ్డి, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు, తహసీల్దార్ ఫహీం ఖాద్రీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న ఆకుతోటపల్లి రైతులకు ఎకరాకు రూ.30 లక్షలు, సాకిబండతండా రైతులకు రూ.36 లక్షలతోపాటు 60 గజాల ప్లాట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంపై రైతుల అభిప్రాయం తీసుకోకుండా భూసేకరణ ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. భూములు కోల్పోతున్న వారికి ఎకరాకు రూ.1.50 కోట్లు ఇవ్వాలని, లేదంటే భూమికి భూమి ఇవ్వడంతోపాటు ఫ్యూచర్‌సిటీలో 500 గజాల ప్లాటు, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా భూములను నమ్ముకుని జీవనం వెళ్లదీస్తున్నామని, ఈ భూములు లాక్కుంటే తమ జీవనం సాగేదెట్లని వాపోయారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు భూములు ఇచ్చేది లేదని గ్రామసభలను బహిష్కరించారు.