కాజీపేట, నవంబర్ 30 : బీఆర్ఎస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు దశలవారీగా చేసిన పోరాటాల ఫలితంగానే కాజీపేటకు రైల్వే ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ సాధ్యమైందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండ జిల్లాలోని కాజీపేట రైల్వేస్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల 45 ఏండ్ల ఆకాంక్ష మేరకే కాజీపేటలో రైల్వే ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ మంజూరైందని అన్నారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ రావడంలో కాంగ్రెస్ పాత్ర శూ న్యం పేర్కొన్నారు. ఇందులో స్థానికులకు 60 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాజీపేట నుంచి తరలిపోతున్న పలు రైల్వే ముఖ్య కార్యాలయాలను కాపాడిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు. అన్ని అర్హతలున్న కాజీపేట రైల్వే జంక్షన్‌కు రైల్వే డివిజన్ హోదా కల్పించాలని డిమాండ్ చేశా రు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కాజీపేట అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసినట్టు తెలిపారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజ య్ భాస్కర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.