వైరా టౌన్, ఆగస్టు 17: తన పొలానికి సాగు నీరు ఇవ్వాలంటూ ఖమ్మం జిల్లా వైరాలో మరో వృద్ధ రైతు ఎస్సై కాళ్లపై పడిన హృదయవిదారక ఘటన చోటుచేసుకున్నది. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు, రైతులు వైరాలోని ఇరిగేషన్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. కార్యాలయానికి వచ్చిన డీఈ నాగబ్రహ్మయ్యను సాగునీరు అందించాలంటూ కోరగా.. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని బదులిచ్చారు. దీంతో రైతులు ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేయగా వైరా ఎస్సై పుప్పాల రామారావు వచ్చి సముదాయించారు. తల్లాడ మండలం కుర్నవల్లి రైతు బోడేపూడి మాధవరావు ఎస్సై కాళ్లమీద పడి సాగునీరు విడుదల చేయించాలని కన్నీటిపర్యంతమయ్యాడు. ఇది తోటి రైతులు, నాయకులను కలచివేసింది. ఇరిగేషన్ ఉన్నతాధికారులతో డీఈ ఫోన్లో మాట్లాడి రైతుల పరిస్థితి వివరించారు. నీటి విడుదలకు వారు అంగీకరించడంతో నీటిని విడుదల చేయాలని డీఈ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైరా రిజర్వాయర్ కుడి కాలువ గేటును నాలుగు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు.