హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో ‘వెల్ఫేర్ బోర్డు’ ఏర్పాటు కార్మికుల్లో చిచ్చుపెట్టింది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఒక రుపాయి ఖర్చు లేకుండా ట్రేడ్ యూనియన్లను ఆర్టీసీలో అనుమతివ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం దానిని పరిగణనలోకి తీసుకోకుండా వెల్ఫేర్ బోర్డు నియామకానికి అంతర్గతంగా ఆదేశాలు జారీచేసింది. యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ట్రేడ్ యూనియన్ల రద్దు వల్ల ఏండ్ల తరబడి కార్మికులకు చట్టబద్ధంగా దక్కాల్సిన హక్కులను పొందలేకపోతున్నామని, కార్మికులు ట్రేడ్ యూనియన్ చట్టాలను కాదని పనిచేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో ట్రేడ్ యూనియన్లకు ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇచ్చిందని, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా ఆరు రకాల హామీలు అమలు చేస్తామని ప్రకటించిందని గుర్తు చేస్తున్నారు. తాజాగా, మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చించకపోవటంతో కార్మికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉండగానే ఆర్టీసీ డిపోల్లో పాత వెల్ఫేర్ కమిటీ సభ్యుల స్థానంలో కొత్త వారిని నియమిస్తామని నోటీస్ బోర్డులపై ప్రకటనలు జారీ చేయటం కార్మికులను రెచ్చిగొట్టినట్టు అయ్యిందని ఆర్టీసీ జాక్ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్‌చైర్మన్ థామస్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 21న ఇందిరాపార్క్ వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. సమావేశంలో జేఏసీ కో-కన్వీనర్లు యాదయ్య, సుద్దాల సురేశ్, జేఏసీ నాయకులు కమలాకర్‌గౌడ్, బాబు, ఎండీ అహ్మద్అలీ, బాల్‌రెడ్డి, జీ రాములు పాల్గొన్నారు. ఆర్టీసీలో వెల్ఫేర్ బోర్డు సభ్యుల నియామకాన్ని రద్దు చేయాలని ఎస్‌డబ్ల్యూయూ, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమిరెల్లి రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్ల పునరుద్ధరణ డిమాండ్‌ను పెడచెవిన పెడుతున్న ప్రభుత్వం, యాజమాన్యవైఖరికి నిరసనగా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించటంపై గురువారం జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీఎస్‌రావు, ప్రచార కార్యదర్శి రవీందర్‌రెడ్డి తెలిపారు.