హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ హైదర్‌గూడలోని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట మాజీ సర్పంచులు శుక్రవారం నిరసన చేపట్టారు. ప్రభుత్వ వాహనానికి అడ్డంగా పడుకొని రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో 2019-24 పీరియడ్‌లో అనేక అభివృద్ధి పనులు చేశామని, ఫలితంగా రికార్డుస్థాయిలో గ్రామాలకు జాతీయ అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు. అభివృద్ధి పనుల బిల్లు లు రాక, అప్పుల పాలైన సర్పంచులు పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ కమిషనర్‌కు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, నాయకులు రాంపాక నాగయ్య, మెడబోయిన గణేశ్, సముద్రాల రమేశ్, మల్లయ్య, బీరప్ప, నవీన్‌రావు పాల్గొన్నారు.