ఎంజీకేఎల్ పరిధిలోని కాల్వలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం కిష్టాపూర్ వద్ద డీ-8 కెనాల్లోకి దిగి రైతులు నిరసన తెలిపారు. వానకాలం ప్రారంభమై నెల దాటినా ప్రభుత్వం సాగునీరు విడుదల చేయడం లేదని వారు మండిపడ్డారు. వర్షాలు లేక నారుమళ్లు ఎండిపోతున్నాయని, నీళ్లిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వర్షాలు లేక ఎండుతున్న పంటలను కాపాడటానికి దేవాదుల నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జనగామ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నాచేశారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 9 దేవాదుల రిజర్వాయర్లు, 723 చెరువులు,
కుంటలను పూర్తిస్థాయిలో నింపితే భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో సమృద్ధిగా నీరుండి వ్యవసాయం ముందుకు సాగుతుందని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపి ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నీటిని రిజర్వాయర్లకు లిఫ్ట్ చేయకుండా రైతాంగానికి పెద్ద ఎత్తున నష్టం కలిగిస్తున్నదని ఆరోపించారు.