నస్పూర్/గద్వాల/ కరీంనగర్ కార్పొరేషన్, అక్టోబర్ 29: రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల పెండింగ్ బకాయిలన్నింటినీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం ఆందోళనలు చేపట్టారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ర్యాలీలు తీసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరీంనగర్లో కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్, బీఆర్ఎస్వీ నాయకుడు పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం దారుణమన్నారు.
బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులు ఇవ్వకపోవడంతో నిరుపేద విద్యార్థులకు విద్య దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కుర్వ పల్లయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని పేర్కొన్నారు. మంచిర్యాలలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్, నియోజకవర్గ అధ్యక్షుడు దగ్గుల మధుకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు నస్పూర్‌లోని కలెక్టరేట్‌ను ముట్టడించి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.