హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లలో అసంతృప్త జ్వాలలు రగులుతున్నాయి. ఎంతోకాలంగా అంగన్వాడీల్లో సేవలందిస్తున్న తమను ప్రీ ప్రైమరీ టీచర్లుగా గుర్తించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జీతాలు పెంచుతామని, సమస్యలను పరిష్కరిస్తామని మ్యానిఫెస్టోలో చేర్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చి ఏడాదైనా అమలు చేయకపోవడంపై అంగన్వాడీలు గుర్రుగా ఉన్నారు. డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు వంటి నిరసన కార్యక్రమాలు చేశారు. మంత్రులు, సంబంధిత అధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు అందజేశారు. అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలోని ఎంపీలందరికీ లేఖలు రాసేందుకు సిద్ధమైనట్టు తెలంగాణ అంగన్వాడీ టీచర్ల సంఘం నాయకురాలు సునీత తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 11 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.