హనుమకొండ, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర మంత్రులు అశ్వినీవైష్ణవ్, కిషన్‌రెడ్డిలకు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితుల నుంచి నిరసనసెగ తాకింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్, బొగ్గు-గనుల మంత్రి కిషన్‌రెడ్డి శనివారం కాజిపేట రైల్వే జంక్షన్ సమీపంలోని అయోధ్యపురంలో నిర్మిస్తున్న కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించారు. మంత్రులను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన భూ నిర్వాసితులు, స్థానికులను పోలీసులు అడ్డుకోవడంతో నిరసన తెలిపారు. న్యాయబద్ధంగా పరిహారం చెల్లించాలని, ఫ్యాక్టరీలో 50 శాతం ఉద్యోగాలను స్థానిక యువతకు ఇవ్వాలని నినాదాలు చేశారు. కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. కాజీపేటలో 40 ఏండ్ల కల అయిన కోచ్ ఫ్యాక్టరీని ప్రధానమంత్రి మోదీ సాకారం చేశారని పేర్కొన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం రూ.500 కోట్లతో చేపట్టిన కోచ్ ఫ్యాక్టరీ పనులు డిసెంబర్ వరకు పూర్తవుతాయని, 2026లో రైల్వే కోచ్‌ల తయారీ మొదలవుతుందని తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో ఇంజిన్లు, బోగీలు, మెట్రో రైళ్లు తయారవుతాయిని చెప్పారు. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఎగుమతి అవుతాయని వెల్లడించారు. ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు పరిహారం, ఉపాధి కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ల పరిధిలో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే ఆర్అండ్ఆర్ పాలసీ ప్రకారం ఉపాధి అవకాశాలు పరిశీలిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వరంగల్ రైల్వే స్టేషన్, వేయిస్తంభాల గుడి, టెక్స్టైల్ పారు, రింగ్ రోడ్డు, మామూనూరు ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేశామని చెప్పారు. మామునూరు ఎయిర్పోర్ట్ కోసం భూములు ఎంత త్వరగా అప్పగిస్తే అంత త్వరగా ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు ఎగురుతాయని తెలిపారు.
దేశాభివృద్ధికి కలిసికట్టుగా ముందుకుసాగాలి
దేశాభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగాలని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ పిలుపునిచ్చారు. 2047 నాటికి ప్రపంచపటంలో భారత్ అగ్రగామిగా నిలవడం ఖాయమని చెప్పారు. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్ 14వ స్నాతకోత్సవానికి శనివారం కేంద్ర మంతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సెమీ కండక్టర్ల అభివృద్ధిలో భారత్ టాప్ -5లో నిలించిందని తెలిపారు. టెలికాం రంగంలో అగ్రగామిలో నిలిచేలా దేశవ్యాప్తంగా 90వేలకు పైగా టవర్లు, 5జీ ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. అనంతరం ఐఐటీహెచ్‌లో విద్యాభ్యాసం పూర్తిచేసిన 1273మంది విద్యార్థులకు గ్రాడ్యుయేట్ పట్టాలను అందజేశారు. సీఎస్సీలో ప్రతిభ చాటిన రాహుల్రామచంద్రన్ బంగారు పతకాన్ని అందుకోగా ప్రత్యేకంగా అభినందించారు.