యాచారం, సెప్టెంబర్ 15: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిపై ఫార్మా బాధిత రైతులు ఆక్రోశం వెళ్లగక్కారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాడు మాతో కలిసి పాదయాత్రలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. మీకు పదవులు రాగానే మమ్మల్ని విస్మరిస్తారా?’ అంటూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన ఫార్మా బాధిత రైతులు సోమవారం తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని నిలదీశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో రైతులు ఇరువురికి వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రైతులు వారి ముందు తమ ఆవేదనను వెళ్లగక్కారు. ‘గతంలో ఫార్మాసిటీకి భూములు ఇవ్వొద్దని మాతో కలిసి ఎలా పాదయాత్ర చేశారో.. మాకు కోర్టు నోటీసులు వచ్చినందున మాతో కోర్టుకు రావాలి’ అని చెప్పారు.