Congress | హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ సామాజికవర్గం సెగ తగలనున్నదా? కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇదే విషయంపై పార్టీని హెచ్చరించినట్టు తెలిసింది. రాష్ట్రంలో మూడు ఎస్సీ రిజర్వు నియోజకవకర్గాలు ఉండగా, వీటన్నింటినీ కాంగ్రెస్ మాల సామాజికవర్గం అభ్యర్థులకే కేటాయించింది. దీంతో తమకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని మాదిగ సామాజిక వర్గానికి చెందిన సొంత పార్టీ నేతలే బాహాటంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ నేరుగా ఇదే అంశంపై సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి లేఖ రాశారు. పెద్దపల్లి టికెట్ ఆశించిన మాదిగ నేతలు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం వద్ద చావు డప్పు కొట్టి నిరసన తెలిపారు. ఈ పరిణామాల పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం కలవరపడింది.
ఈ అంశం ఎంపీ ఎన్నికల్లో ఏమైనా ప్రభావం చూపుతుందా? అనే కోణంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్ కూడా ఫ్లాష్ సర్వే నిర్వహించినట్టు తెలిసింది. పెద్దపల్లిలో ఈ అంశం పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉన్నదని ఈ టీమ్ పార్టీకి నివేదిక అందజేసినట్టు తెలిసింది. పెద్దపల్లి పరిధిలో ఏండ్లతరబడి మాల సామాజికవర్గానికి చెందిన దివంగత జీ వెంకటస్వామి (కాకా) కుటుంబమే రాజకీయ పెత్తనం చెలాయిస్తున్నదని, ఆయన కుమారుడు వివేక్ పార్టీ అధికారంలో లేకపోతే పార్టీ మారడం, అధికారంలోకి రాగానే తిరిగి రావడం జరుగుతున్నదని అక్కడ మాదిగ సామాజిక వర్గం నేతలు ఆగ్రహంతో ఉన్నట్టు అధిష్ఠానానికి నివేదిక అందినట్టు సమాచారం. ఇప్పటికే కాకా కుమారులు వివేక్, వినోద్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
తాజాగా పెద్దపల్లి ఎంపీ టికెట్‌ను కూడా వివేక్ కొడుకు వంశీకి ఇ చ్చింది. దీంతో అక్కడ మాదిగ సామాజిక వర్గం నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఇదే విషయం ప్లాష్ సర్వేలో కూడా వ్యక్తం కావడంతో పార్టీ అప్రమత్తమైనట్టు తెలిసింది. దీంతో ప్రేమ్‌సాగర్ ఇంట్లో ఏర్పాటుచేసిన సమావేశానికి మంత్రి శ్రీధర్‌బాబు హాజరై ఎమ్మెల్యేలతో చర్చించినట్టు తెలిసింది. వంశీ విజయావకాశాలు దెబ్బతినకుండా స్థానిక మాదిగ సామాజిక వర్గం నేతలను బుజ్జగించి దారికి తెచ్చుకునే బాధ్యత ఎమ్మెల్యేలదే అని మంత్రి దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. మరోవైపు, తనకు టికెట్ దక్కలేదని పెద్దపల్లిలో దీక్షకు ఉపక్రమించిన యూత్ కాంగ్రెస్ నాయకుడు ఊట్ల వరప్రసాద్‌ను సీఎం రేవంత్‌రెడ్డి గురువారం బుజ్జగించారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో వరప్రసాద్ దీక్ష విరమించుకున్నారు.