గోవిందరావుపేట, అక్టోబర్ 23: రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీస్ విధానం ఉండాలని ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి సమీపంలోని లక్నవరం క్రాస్ వద్ద ఉన్న 5వ పోలీస్ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ప్లకార్డులను పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో సుమారు అరగంటపాటు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పోలీసుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడే పోలీస్ వ్యవస్థలో ఏక్ పోలీస్ విధానాన్ని అనుసరించడం లేదని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుళ్లు వెట్టిచాకిరీ చేస్తున్నా.. వారి కుటుంబాల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. విధి నిర్వహణ పేరుతో ప్రభుత్వం వారిని కుటుంబాలకు దూరం చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న పస్రా సీఐ రవీందర్ ఘటనా స్థలానికి చేరుకొని రాస్తారోకోను విరమింపజేశారు.
కరీమాబాద్, అక్టోబర్ 23: రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీసింగ్ విధానం అమలు చేయాలని కోరుతూ రోడ్డుపై నిరసన తెలిపిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులపై పోలీస్ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. వరంగల్ జిల్లాలోని మామునూరు 4వ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యాపిల్లలు ఇటీవల ఆర్టీవో జంక్షన్లో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్టు సమాచారం. ఈ మేరకు పలు ఫొటోలు, వీడియోల ఆధారంగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తున్నది. బెటాలియన్‌లో ఉన్న కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు ఎవరున్నారో తెలుసుకునే పనిలో ఉన్నట్టు సమాచారం. కుటుంబ సభ్యుల ఆందోళనలతో కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నట్టు పలు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా.. అలాంటిదేమీ లేదని చెప్పినట్టు సమాచారం.