మహబూబ్నగర్, నవంబర్ 12 : మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ పోలీస్ స్టేషన్ ఎదుట దళిత సంఘాల నాయకులు, బాధిత కుటుంబీకులు, గ్రామస్థులు బుధవారం ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. కోయిలకొండ మండలం వీర్నపల్లికి చెందిన బలరాం, అతడి తల్లి ముత్యాలమ్మ మంగళవారం మహబూబ్నగర్లో దవాఖాన నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా.. దమాయిపల్లి స్టేజీ సమీపంలో కారు ఢీకొంది. రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి చెందగా.. ఎస్సై మృతుల కుటుంబానికి న్యాయం చేయకుండా.. అధికార పార్టీకి అమ్ముడుపోయి అన్యాయం చేస్తున్నారని దళితులు మండిపడ్డారు. అధికార పార్టీకి, డబ్బులకు తలొగ్గిన ఎస్సై దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.