హైదరాబాద్ : నర్సింగ్ వృత్తిలో నైపుణ్యం, అనుభవంతో పాటు విదేశీ భాషా ప్రావిణ్యం సంపాదిస్తే అనేక దేశాల్లోని ప్రధాన ఆసుపత్రుల్లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని తెలంగాణ కార్మిక, ఉపాధి కల్పనా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాణి కుముదిణి అన్నారు. బుధవారం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) ఆధ్వర్యంలో ‘ విదేశాలలో ఆరోగ్య రంగంలో ఉపాధి అవకాశాలు ’ అనే అంశంపై గాంధీ వైద్య కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా తరువాత అనేక దేశాలలో ఆరోగ్య రంగంలో నైపుణ్యత గల సిబ్బంది కొరత ఏర్పడిందన్నారు. తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి ఉన్నవారికి టామ్‌కామ్ శిక్షణ ఇవ్వడానికి అన్ని జిల్లాలో అవగాహన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు . టామ్‌కామ్ సీఈవో విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 12 దేశాలోని అధికారిక కన్సల్టెన్సీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.
ఆయా దేశాల భాషపై ఆరు నెలల శిక్షణ అనంతరం వారికి గ్యారంటీగా ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తున్నామని వివరించారు. అమెరికా, కెనడా దేశాలకు స్క్రీనింగ్ ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. ఈ సదస్సులో తెలంగాణ నర్సింగ్ విభాగం రిజిస్ట్రార్ విద్యావతి, డిప్యూటీ డైరెక్టర్ విద్యుల్లత తదితరులు పాల్గొన్నారు.