హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ సందర్భంగా నాటుకోళ్లకు డిమాండ్ పెరిగింది. ధరలు అమాంతంగా పెరిగా యి. ఏపీలో కిలో ధర 2వేల నుంచి 2500 వరకు పలుకుతుండగా, తెలంగాణలో 1000 వరకు ఉన్నది. దీంతో పండుగ పూట నాటుకోడి తినాలన్న కోరిక నెరవేరడం లేదు. ఈ ఏడాది నా టుకోళ్ల ఉత్పత్తి తగ్గడంతోపాటు, వీటిని పెంచే రైతుల సంఖ్య తక్కువగా ఉండటంతో కొరత ఏర్పడింది. ఖమ్మం, కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లోపాటు గోదావరి జిల్లాల్లో కూడా వీటి ఉత్పత్తి మందగించింది.
ఏపీలోని పందెం కోళ్ల కు రూ.5వేల నుంచి రూ.20 వేల వర కు విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు మిగతా జిల్లాల్లో సాధారణ ఫాంలలో పెంచిన క్రాస్ బ్రీడ్ నాటుకోళ్లు కేజీ రూ.700 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. మార్కెట్లో యాట మాంసం ధర 800 నుంచి 900 పలుకుతుండగా, నాటుకోడి మాంసం ధర దానికి రెట్టింపు ఉండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బ్రాయిలర్ చికెన్‌తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల బ్రాయిలర్ చికెన్ ధర కూడా పెరిగినప్పటికీ ..కొంతవరకు ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం బ్రాయిలర్ చికెన్ దర కేజీ రూ.300 నుంచి రూ.320 వరకు పలుకుతున్నది.