ములకలపల్లి, అక్టోబర్ 27 : భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ పరిపాలనాధికారి(జీపీవో)ని ఏసీబీ అధికారులకు పట్టుకు న్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ రమేశ్ వివరాల ప్రకారం.. వేముకుంటకు చెందిన ఓ రైతు భూమి రిజిస్ట్రేషన్ కోసం భూ భారతి పోర్టల్‌లో ఈనెల 2న స్లాట్ బుక్ చేసుకున్నాడు. ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పూసుగూడెం జీపీవో బీ శ్రీనివాస్‌కు భూమి రిజిస్ట్రేషన్ అంశాన్ని వివరించాడు. ఇందుకోసం జీపీవో రూ.60 వేలు డిమాండ్ చేశాడు. దీంతో రైతు అదేరోజు రూ.40 అందజేశాడు. మిగతా రూ.20 వేలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో విసుగు చెందిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జీపీవో శ్రీనివాస్‌నాయక్‌కు రైతు 15 వేలు లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శ్రీనివాస్‌నాయక్‌ను అరెస్టు చేసి వరంగల్‌కు రిమాండ్ చేసినట్టు డీఎస్పీ వివరించారు.
వరంగల్‌చౌరస్తా, అక్టోబర్ 27 : వ రంగల్ ఎంజీఎం దవాఖానలో ఇద్దరు చిన్నారులకు ఒకే సిలిండర్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తూ రేడియాలజీ విభాగానికి తరలించిన ఘటనలో అలసత్వం వహించిన ఉద్యోగులు, సిబ్బందికి వైద్యాధికారులు నోటీసులు జారీచేశారు. పీడియాట్రిక్ విభాగంలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో పీడియాట్రిక్ విభాగాధిపతితోపాటు ఇద్దరు నర్సింగ్ సిబ్బందికి షో కాజు నోటీసులు జారీచేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పేషెంట్ కేర్ సిబ్బందిని విధుల నుంచి తొలగించాల్సిందిగా సంబందిత కాంట్రాక్టు సంస్థకు నోటీసులు ఇచ్చారు. మంత్రి ఆదేశించినప్పటికీ ఉన్నతాధికారులపై చర్యలు చేపట్టకుండా, కిందిస్థాయి సిబ్బందిని బాధ్యులను చేస్తూ నోటీసు లు జారీ చేయడాన్ని ఉద్యోగ సంఘాల నేతలు తప్పుబడుతున్నారు.