హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యు త్తు శాఖలో బంగారు బాతు వంటి ఓ కీలక పోస్టుకు భారీ డిమాండ్ పలుకుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా రూ.5 కోట్లు పలుకుతుందని గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఆ రూ.5 కోట్లు పెట్టుకోలేక ఒక్కొక్కరూ బెదిరిపోతున్నారట. అందుకే నెలన్నరగా రాష్ట్ర ప్రభుత్వం ఆ పోస్టును భర్తీ చేయలేకపోతుందని ఆ శాఖలో ఒకటే చర్చ జరుగుతున్నది. విద్యుత్తు శాఖలో ఇన్స్పెక్టర్ (చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ జనరల్) పోస్టు ఖాళీగా ఉంది. నెలన్నరగా ఈ పోస్టులో కొత్తవారిని నియమించనే లేదు. ఇదే పోస్టుకు అక్షరాలా రూ.5 కోట్ల రేటు పలుకుతున్నదని ప్రచారం. ఈ ఒక్క పోస్టు దక్కితే చాలు.. రాష్ట్రంలో నాలుగు డిప్యూటీ సీఈఐజీ పోస్టులను కూడా సొంతం చేసుకునే అవకాశం ఉండటంతో అంతకు బేరం పెట్టేశారని చెప్తున్నారు.
అంత పెద్ద మొత్తంలో సమర్పించుకోలేక కొందరు వెనుకడుగేశారని తెలుస్తున్నది. నెల క్రితం ఈ పోస్టును ఆర్అండ్బీ శాఖలో పనిచేసే ఓ అధికారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైందని తెలిసింది. అయితే రూ.5 కోట్లు అనేసరికి సదరు అధికారి బెంబేలెత్తిపోయారని, ఆ మొత్తం సమర్పించుకోలేక ఆయన వెనుకడుగేశారని గుసగుసలు. సీఐఈజీలో పనిచేస్తున్న పలువురు డిప్యూటీ ఇన్స్పెక్టర్లు, ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డులో పనిచేస్తున్న వారు కూడా ఈ పోస్టుపై కన్నేశారని సమాచారం. ఈ పోస్టును కైవసం చేసుకునేందుకు ఇప్పటికే కొందరు ఇంధన శాఖ సెక్రటరీ, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశారు. సచివాలయం స్థాయిలో పైరవీలు కూడా నడిచాయి. బేరాలు కుదరకే ఈ పోస్టును పక్కన పెట్టేశారన్న ప్రచారం జోరుగా సాగుతున్నది.
వందల సంఖ్యలో ఫైళ్లు పెండింగ్
సీఈఐజీగా పనిచేసిన రామాంజనేయులు గత ఏప్రిల్ 30న ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించాల్సి ఉండగా, ఇంతవరకు కొత్త సీఈఐజీని ప్రభుత్వం నియమించలేదు. దీంతో వందల సంఖ్యలో ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. అధికారిక సమాచారం ప్రకారం 400 ఫైళ్లు ఈ ఒక్క కార్యాలయంలోనే పేరుకుపోయాయి. మే 1 నుంచి జూన్ 17 వరకు ఒక్క సంస్థ ఆన్లైన్ ఫైళ్లు 25 వరకు పెండింగ్లో ఉన్నాయి. ఇదే అదనుగా కార్యాలయ సిబ్బంది ఆయారాం, గయారాం అన్నట్టుగా ఇలా వచ్చి అలా వెళుతున్నారు.
ఆందోళనలో బాధితులు
15 మీటర్ల భవనాలు (జీ ప్లస్ 5 అంతస్థులు), 56 కిలోవాట్స్ పైబడిన హెచ్టీ విద్యుత్తు కనెక్షన్దారులు, 70 కిలోవాట్స్ సామర్థ్యానికి మించిన ప్రతి కనెక్షన్దారు సీఈఐజీ అనుమతి తీసుకోవాల్సిందే. అపార్ట్మెంట్లు, సినిమాహాళ్లు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, సోలార్ ప్లాంట్లు కూడా తప్పక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సీఈఐజీ అప్రూవల్ ఉంటేనే డిస్కం అధికారులు విద్యుత్తు కనెక్షన్ జారీచేస్తారు, లేదంటే ఇవ్వరు. బిల్డింగ్ విద్యుత్తు లైన్స్ డ్రాయింగ్, టీఎస్ బీపాస్, పోర్టల్లో వచ్చిన దరఖాస్తులను బట్టి అధికారులు వెళ్లి తనిఖీలు చేసి, అనుమతులు ఇవ్వాలి. అయితే నెలన్నరగా అనుమతులు, తనిఖీలు నిలిచిపోయాయి. దీంతో కొత్త విద్యుత్తు కనెక్షన్ల జారీ కూడా నిలిచిపోయింది. నిర్మాణాలు పూర్తికావడం, విద్యుత్తు కనెక్షన్లు జారీకాకపోవడంతో బాధితులు ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు. కాళ్లరిగేలా తిరిగి విసిగి వేసారిపోయిన పలువురు బాధితులు ఆందోళనకు దిగేందుకు సమాయత్తమవుతున్నట్టు తెలిసింది. సీఈఐజీ కార్యాలయం, సచివాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం.