హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగాలు ఇస్తామని తమను నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ వీఆర్ఏలు, వారి వారసులు మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 81, 85 ప్రకారం వెంటనే 3,797 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వందలాది మంది తరలిరావడం, వారిని పోలీసులు రోడ్డుపైనే అడ్డుకోవడంతో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. వీఆర్ఏలు, వారి వారసులు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు, వీఆర్ఏల మధ్య తోపులాట జరిగింది. తమ ఆరోగ్యం బాగాలేదని కొందరు మహిళలు కాళ్లావేళ్లా పడ్డా పోలీసులు కనికరించలేదు.
\ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు మద్దతు పలికిన రేవంత్‌రెడ్డి.. సీఎం అయ్యాక మాట మార్చారని వారు మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు మరికొంతమంది బాధితులు ప్రజాభవన్‌కు వెళ్లారు. ప్రజావాణి నోడల్ అధికారి దివ్యతో చర్చించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆమె చెప్పగా.. ప్రతిసారి ఇదే చెప్తున్నారని, ప్రభుత్వం స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు బాధితులు సచివాలయానికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. మీడియా పాయింట్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
61 ఏండ్లకు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,797 మంది అర్హులు ఉన్నట్టు గుర్తించారని కానీ, ఎన్నికల కోడ్‌తో అమలు కాలేదని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే వెంటనే ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ నమ్మించిందని వాపోయారు. 14 నెలలుగా అధికారులు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే తమకు నియామకపత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.