నవీపేట/పొతంగల్, అక్టోబర్ 13: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన బాటపట్టారు. సోమవారం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ వద్ద నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.50వేల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించగా.. పొతంగల్ మండల కేంద్రంలో నష్టపరిహారంతోపాటు పాటు బోనస్‌పై స్పష్టత నివ్వాలని కోరుతూ రాస్తారోకో చేపట్టారు. యంచ వద్ద చేపట్టిన ధర్నాలో నవీపేట మండలంలోని కోస్లీ, మిట్టాపూర్, యంచ, అల్జాపూర్, నందిగామ, బినోలా, నిజాంపూర్, తుంగిని, నాళేశ్వర్ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు పాల్గొనగా.. బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ మద్దతు ప్రకటించాయి.
రైతులను ఆదుకోవడంలో ఎమ్మెల్యే సుందర్శన్రెడ్డితోపాటు ఎంపీ అర్వింద్ అలసత్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తన స్వార్థ రాజకీయంవల్ల ఎగువ ప్రాంతం నుంచి గోదావరికిలోకి వస్తున్న ఇన్‌ఫ్లోకు అనుకూలంగా దిగువకు వరదను విడుదల చేయక పోవడం కారణంగానే ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తో నవీపేట మండలంలో గోదావరి పరీవాహక గ్రామాల్లో ఐదు వేల ఎకరాలకు పైగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆవేదన వ్యక్తంచేశారు. నష్టపరిహారం అందించనిపక్షంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తహసీల్దార్ వెంకటరమణ, ఎస్సై తిరుపతి, ఏవో నవీన్‌కుమార్ చేరుకొని రైతులను సముదాయించారు.
భైంసాలో సోయా రైతుల ధర్నా
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గాంధీగంజ్ వద్ద గల ప్రధాన రహదారిపై సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు. సోయాకు మద్దతు ధర కల్పించాలని రాస్తారోకో చేశారు. భైంసా పట్టణ సీఐ గోపీనాథ్ రైతులతో మాట్లాడి సముదాయించారు. భైంసా మార్కెట్ కార్యదర్శి పురియ రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామనడంతో ఆందోళన విరమించారు. సోయా కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.4,200కే కొనుగోలు చేస్తూ, 3 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు మండిపడ్డారు.